13-04-2025 12:00:00 AM
చేవెళ్ల, ఏప్రిల్ 12: మొయినాబాద్ మండ లం తోల్కట్ట గ్రామంలో సర్వే నెం. 143లో ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జాకు యత్నించడం కలకలం రేపింది. శనివారం ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ వేయిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్ నేతృత్వం లో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పనులు ఆపించారు. అదే సమయంలో మొయినాబాద్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు.
ఈ ఘటనను చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ అక్రమ కబ్జాలను అరికట్టాలని క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, భూకబ్జాదారులు ఈ భూమిని పట్టాభూమిగా చిత్రీక రించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. విష యం తెలుసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భీమ్ భరత్, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.