- అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
- ఫారెస్టు ల్యాండ్‌ను ప్రైవేట్ స్థలంగా చూపుతూ 50 వేల మందికి విక్రయించిన యూసఫ్‌ఖాన్
ఎల్బీనగర్, జనవరి 26: గణతంత్ర దినోత్సవ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, పార్కు స్థలాన్ని అక్రమించుకోవాలని ఒక న్యాయవాది ఇచ్చిన పిలుపుతో భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో వనస్థలిపురం పోలీసులు భారీగా మోహరించి, అక్రమణ దారులను అరెస్టు చేసి, వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్‌లో సర్వేనంబర్ 7లో ఆటోనగర్ డంపింగ్‌యార్డు పక్కన 580 ఎకరాల ఫారెస్టు ల్యాండ్ ఉన్నది. ఈ స్థలాన్ని ప్రైవేట్ స్థలంగా చూపుతూ నకిలీ పత్రాలు సృష్టించిన యూసుఫ్‌ఖాన్, సుల్తానా దంపతులు 50 వేల మందికి విక్రయించారు. ఈ స్థలాన్ని పేదప్రజలకు నోటరీపై విక్రయిస్తూ యూసుఫ్‌ఖాన్, సుల్తానా దంపతులు కోట్ల రూపాయలు గడించారు.
అనేకసార్లు ఫారెస్టు అధికారులతోపాటు కబ్జాదారుడు కోర్టులో కేసు వేశారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి గణతంత్ర దినోత్సవం రోజున అందరూ తరలిరావాలని కేసు వాదిస్తున్న న్యాయవాది జిలానీఖాన్ పిలుపునిచ్చారు.
దీంతో స్థలాన్ని కొన్నవారు సుమారు 200 మంది మన్సూరాబాద్ డివిజన్‌లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులోని ఫారెస్టు స్థలానికి భారీగా తరలివచ్చారు. సమాచారం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు పార్కు వద్దకు చేరుకుని, పార్కు స్వాధీనానికి వచ్చినవారిని అరెస్టు చేసి, వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
అటవీశాఖ స్థలం తమ తల్లిదని యూసుఫ్‌ఖాన్ పత్రాలు సృష్టించి, 20 ఏండ్ల క్రితం సుమారు 50 వేల మందికి 60, 70, 80 గజాల చొప్పున విక్రయించాడు. దీనిపై హైకోర్టులో కేసు వేయగా, ఆయా పిటిషన్లను కోర్టు కొట్టువేసింది. ఇప్పటివరకు 280 రిట్ పిటిషన్లు వేశారు. ఈ స్థలాన్ని కొన్నవారు నోటరీ పత్రాలతో జనవరి 26న పార్కు వద్దకు రావాలని న్యాయవాది జిలానీ పిలుపునిచ్చారు.
దీంతో స్థలాలను కొన్నవారు ఆదివారం భారీగా వనస్థలి పార్కు వద్దకు తరలివచ్చారు. సమాచారం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి, ఆందోళనకారులను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి వెంటనే పార్కు వద్దకు చేరుకున్నారు.
అటవీశాఖ స్థలాన్ని రక్షించాలని అధికారులను కోరారు. ఈ విషయంపై ఫారెస్టు అధికారులు మాట్లాడుతూ.. మన్సూరాబాద్ సర్వే నంబర్ 7లోని 580 ఎకరాల భూమి పూర్తిగా రిజర్వ్ స్థలమని, ప్రభుత్వ స్థలాన్ని అటవీశాఖకు కేటాయించిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సాయిప్రకాశ్ పేర్కొన్నారు.