calender_icon.png 9 October, 2024 | 10:49 PM

అట్టహాసంగా సీఎం కప్-2024 ప్రారంభం

04-10-2024 12:00:00 AM

  1. మస్కట్, లోగో,పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 
  2. అండర్-17 ఫుట్‌బాల్ జట్టును దత్తత తీసుకుంటాం

హైదరాబాద్, అక్టోబర్ 3(విజయక్రాంతి): రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గురువారం ఎల్బీ స్టేడియంలో సీఎం కప్-2024 ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా క్రీడాజ్యోతి టార్చ్ రిలేను రేవంత్ రెడ్డి వెలిగించారు. మస్కట్‌తో పాటు పల్లెల నుంచి ప్రపంచ స్థాయి ట్యాగ్‌లైన్‌తో ఉన్న లోగో, పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 25ఏళ్ల క్రితం కామన్‌వెల్త్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌ను నిర్వహించి క్రీడలకు హైదరాబాద్ తలమానికంగా మారిందన్నారు.

అయితే గత పదేళ్లలో మాత్రం రాష్ట్రంలో క్రీడలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరాన్ని  స్పోర్ట్స్ హబ్‌గా మార్చే ఉద్దేశంతోనే ఈ సీఎం కప్‌ను నిర్వహిస్తున్నామని ప్రకటించారు.

సౌత్ కొరియా కోచ్‌లతో ట్రైనింగ్

సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘అండర్ ఫుల్ బాల్ నేషనల్ టీమ్‌ను తెలంగాణ దత్తత తీసుకోవాలని నిర్ణయించాం. ఇప్పటికే జాతీయ ఫుల్ బాల్ అసోషియేషన్‌తో చర్చించాం. ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా 36 పతకాలను గెలుచుకుంది. కానీ 140 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం చాలా వెనకబడిపోయింది.

ఈ క్రమంలో ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లలో దక్షిణ కొరియా కోచ్‌లను తెలంగాణకు తీసుకురానున్నాం. ’ అని పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే దానికి నిఖత్ జరీన్ జీవితమే నిదర్శనమని సీఎం రేవంత్ అన్నారు.

ప్రపంచస్థాయిలో రాణించిన నిఖత్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో రాణించిన సిరాజ్‌కు అర్హత లేకపోయినా నిబంధనలను సడలించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని గుర్తు చేశారు. క్రీడాకారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. క్రీడాకారులను అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు.