calender_icon.png 15 November, 2024 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకోసం పనిచేస్తున్న మాపై దాడులా?

13-11-2024 12:00:00 AM

  1. ప్రభుత్వ అధికారులపై దాడి బాధాకరం
  2. వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన
  3. వారికి టీజీవో, ట్రెసా, ఇతర సంఘాల మద్దతు

వికారాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్లలో సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డితో పాటు ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిపై ప్రభుత్వ ఉద్యోగులు భగ్గుమన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది మంగళవారం విధులను బహిష్కరించి, నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

లగచర్ల దాడి ఘటన తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే అధికారులపై దాడులు చేయడం బాధాకరమన్నారు. దాడులు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయకుంటే రెండు రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు.

ఉద్యోగులెవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని పిలుపు నిచ్చారు. నిరసనకు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) యూనియన్, ట్రెసా నేతలు, ఇతర అధికారుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిం చాయి. అధికారుల నిరసనతో అన్ని శాఖల పరిధిలో పనులు స్తంభించాయి.

దాడులను సహించేది లేదు

ప్రభుత్వ అధికారులపై దాడులను సహించేది లేదు. మేం రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మంది ఉద్యోగులం ఉన్నాం. పాలనను ఎక్కడికక్కడ స్తంభింపజేసే శక్తి మాకు ఉంది. మేం 62 సంఘాలతో బలంగా ఉన్నాం. మేం నిబద్ధతతో పనిచేస్తాం కానీ, మా జోలికి వేస్తే సహించబోం. అధికారులు మీ ఇళ్లలో పనిచేసే వాళ్లు కాదు. దాడులు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయకుంటే రెండు రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఉద్యోగులెవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. టీజీవో అండగా ఉంటుంది. 

 ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..?

కలెక్టర్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ స్థాయి అధికారులపై మూకుమ్మడి దాడి చేసేంత సాహసమా? అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? దాడుల తీరును చూస్తుంటే ముందస్తు కుట్రతోనే జరిగినట్లు కనిపిస్తున్నది. గుండాలు, రౌడీలు పనిగట్టుకొని దాడి చేశారు. జిల్లా స్థాయి ఉద్యోగులపైనే ఇలాంటి దాడులు జరిగితే, ఇక కింది స్థాయి ఉద్యోగుల భద్రతకు భరోసా ఏంటి? రాష్ట్ర అభివృద్ధిలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది. ప్రజలారా మేం మీ ఇంటి మనుషుల్లా పనిచేస్తున్నాం. మీ కోసం జీవితాలను ధారపోస్తున్నాం. మాపై దాడులు సమంజసమా?

 వంగ రవీందర్ రెడ్డి, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు 

అభద్రతా భావంలో ఉద్యోగులు..

కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, కడా అధికారిపై జరిగిన దాడులతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అభద్రతా భావంలోకి వెళ్లారు. పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకోకుంటే మేం విధులు నిర్వహించలేం. రెవెన్యూ ఉద్యోగులు తమ కుటుంబాలకంటే ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడుపుతారు. అలాంటి ఉద్యోగులపై దాడి చేస్తే ఉద్యోగులు విధులు నిర్వర్తించడమేలా?

గౌతమ్‌కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి