calender_icon.png 22 October, 2024 | 5:14 AM

దేవాలయాలపై దాడులు చేస్తే ఊరుకోం

22-10-2024 12:29:15 AM

ముత్యాలమ్మ ఆలయ ఘటనపై ఘటనపై గజ్వేల్‌లో ర్యాలీ

గజ్వేల్,అక్టోబరు21: సనాతన ధర్మంపై దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోమని దీప, ధూప నైవేద్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శేషం శ్రీనివాసాచార్యులు, జిల్లా అధ్యక్షుడు చాడ నందబాలశర్మ హెచ్చరించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటనను నిరసిస్తూ సోమవారం గజ్వేల్‌లో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు.

అంగడిపేట హనుమాన్ ఆలయం నుంచి గజ్వేల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ సీఐ సైదాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మమంటే నచ్చనివారు దేశం విడిచి వెళ్లాలని కోరారు.

రోజురోజుకు హిందూ దేవాలయాలపై అన్య మతస్తుల దాడులు పెరిగిపోతున్నాయని, ఇలాగే కొనకసాగితే హిందువుల మనుగడ కష్టమవుతుందన్నారు. అందరూ బాగుండాలని సనాతన ధర్మం చెబుతుందని, అన్యా యాన్ని కూడా ఎదురించాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వెల్లడించారన్నారు. 

సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం..

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటనపై నిరసన వ్యక్తం చేసిన హిందువులు, బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ గజ్వేల్‌లో బీజేపీ లీడర్లు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. నాయకులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.

శాంతియుతంగా నిరసన చేస్తున్న హిందువులపై అమానుషంగా లాఠీచార్జ్ చేశారని, మతోన్మాదులకేమో రక్షణ కల్పించి రాష్ట్రం దాటించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు జశ్వంత్‌రెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కుడిక్యాల రాములు, లీడర్లు ఎల్కంటి సురేశ్, సిల్వేరి జనార్ధన్, నాగుముదిరాజ్, మనోహర్ యాదవ్, అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.