కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
రాజేంద్రనగర్, నవంబర్ 8: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆలయాలు, హిందువులపై దాడులు పెరిగాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దాడులు చేసి పిచ్చోళ్లపై నెడుతున్నారని.. వాళ్లకు కేవలం గుడులు మాత్రమే కనిపిస్తాయా? మసీదులు, చర్చిలు కనిపించవా? అని ప్రశ్నించారు.
ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలోని హనుమాన్ ఆలయం లో ఉన్న నవగ్రహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యం లో శుక్రవారం సాయంత్రం ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిత్యం ఎక్కడో ఒకచోట ఆలయాలపై దాడులు జరుగుతున్నా సర్కారు మొద్దు నిద్రలో ఉందని ధ్వజమెత్తారు.
సర్కారు హిందూ వ్యతిరేకులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. హిందువుల సహనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షించవద్దని హితవు పలికారు. సీఎం తన బర్త్‌డే సందర్భంగా యాదగిరి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉంద ని, ఆయన ఇప్పటికైనా స్పందించి ఆలయాలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తే బాగుంటుందని సూచించారు.
ఆలయాలపై దాడులు జరిగినప్పుడు స్పందించిన వారే నిజమైన హిందువులన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సిం హారెడ్డి, రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్‌రెడ్డి, డాక్టర్ ప్రేమ్‌రాజ్, నాయకుడు వేణుగోపాల్ పాల్గొన్నారు.