- నిందితులను కఠినంగా శిక్షించాలి
- శంషాబాద్‌లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
రాజేంద్రనగర్, నవంబర్ 6: కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతోనే రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు, ఆయా పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలోని హనుమాన్ ఆలయంలో మంగళవారం నవగ్రహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు, ఆయా పార్టీల నేతలు బుధవారం శంషాబాద్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పట్టణంలోని బస్టాండ్ నుంచి డీసీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు, నేతలు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సర్కారు మొద్దు నిద్ర వీడి ఆలయాలపై దాడులు చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం నాయకులు డీసీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.