calender_icon.png 24 November, 2024 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ప్రోద్బలంతోనే అధికారులపై దాడులు..

12-11-2024 06:27:45 PM

దాడి చేసిన వారు ప్రతిపక్ష నాయకులకు సన్నిహితులు..

 ఫోన్ సంభాషణలతో బయటపడ్డ బిఆర్ఎస్ కుట్ర..

అసలు దొంగ కేటీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి..

బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్...

ముషీరాబాద్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై కెటిఆర్ ప్రోద్బలంతోనే బిఆర్ఎస్ నాయకులు దాడి చేశారని, దాడి చేసిన బిఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచాల మాట్లాడుతూ.. సోమవారం అధికారులపై జరిగిన పాశావిక దాడి ముందస్తు పథకం ప్రకారమే చేసిన దాడిగా చూడాలని, రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిచేయడంగానే పరిగణించి దోషులతో పాటు వారి వెనక ఉన్న పార్టీ పెద్దలను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అష్ట కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ హైదరాబాదును డ్రగ్స్ రహిత నగరంగా చేయాలని సంకల్పించడంతో హైదరాబాదులో డ్రగ్స్ దొరకటం లేదని, దీంతో కేటీఆర్ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడంతో ఉద్యోగులను అడ్డం పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి సృష్టించి లబ్ది పొందాలని బిఆర్ఎస్ పార్టీ కుట్రచేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి సురేష్ ఫోన్ నుంచి పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ కి అనేకసార్లు ఫోన్ కాల్స్ వెళ్లడం అనేక అనుమానాలకు దారి తీస్తుందన్నారు.

గత ప్రభుత్వంలో నాయకులు ఎప్పుడు కూడా అభివృద్ధి అంశాల్లో రాజకీయం చేయలేదని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై వింత విధానాన్ని బీఆర్ఎస్ నాయకులు అనుసరిస్తున్నారని వాపోయారు. సమగ్ర కులగణనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ బిజెపి నాయకులు కుట్రపూరిత  విధానాన్ని అవలంబిస్తున్నారని, సమగ్ర సర్వేకు ఎవరు అడ్డువచ్చినా సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, నాయకులు సాయిబాబా, రాఘవేందర్, నగేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.