కరీంనగర్, వనపర్తి జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలు
ధాన్యం నిల్వల్లో వేల బస్తాలు మాయం!
రూ. కోట్లలో జరిమానా?
వనపర్తి, జూలై ౧౭ (విజయక్రాంతి)/ హుజూరాబాద్: గడువు ముగిసినా సీఎంఆర్ చెల్లించని రైసు మిల్లులపై సివిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరా బాద్, వనపర్తి జిల్లాలోని పలు మిల్లుల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌లోని ఎస్సార్ ట్రేడర్స్ మిల్లులో దాదాపు రెండు గంటలపాటు అధికారులు తనిఖీలు చేపట్టారు.
ప్రభుత్వం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని సదరు మిల్లు యజమాని పక్కదారి పట్టించినట్టు గుర్తించారు. ప్రభుత్వానికి బాకీ ఉన్న ధాన్యంలో 14,805 క్వింటాళ్ల వ్యత్యాసం ఉందని గమనించి, కేసు నమోదుకు సిద్ధం అయ్యారు. బాకీ ఉన్న ధాన్యానికి డబ్బులు లేదా ధాన్యం ఇస్తామని మిల్లు యజమాని బొబ్బల రాజిరెడ్డి అధికారులకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో అధికారులు కొంత గడువు ఇచ్చారు. వనపర్తి జిల్లా పరిధిలో రెండు రైస్ మిల్లులపైనా సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహిం చారు.
వనపర్తి మండల చిట్యాల గ్రామ శివారులోని లక్ష్మీ నరసింహ బాయిల్డ్ మిల్లులో టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ ద్రోణాచారి తనిఖీ చేయగా పౌరసరఫరాల శాఖకు ఇవ్వాల్సిన సీఎంఆర్‌లో దాదాపు 23,164 బస్తాల ధాన్యం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. పెబ్బేర్ చెలిమిల్లలో గల శ్రీసత్యసాయి ఇండస్ట్రీస్ మిల్లులో పౌరసరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్ ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా 20వేల బస్తాల ధాన్యం మాయం అయినట్టు గుర్తించారు. లక్ష్మీనరసింహ బాయిల్డ్ మిల్లుకు రూ.2 కోట్లు, సత్యసాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు సైతం భారీ జరిమానాను విధించారు. వారం రోజుల్లో జరిమానా చెల్లించకపోతే శాఖాపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించినట్టు తెలిసింది.