- కదిరే కృష్ణపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (విజయక్రాంతి): ఆది హిందూ బహుజనులపై ఆర్య మనువాదుల దాడులను ఖండించాలని, డా.కదిరే కృష్ణపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రొ.కాశీం సహా పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం బహుజన సేన ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో వాసు కే యాదవ్ అధ్యక్షతన వివిధ ప్రజా సంఘాలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొ.కాశీం, సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి, సీనియర్ న్యాయవాది రఘునాథ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం జరిగిన సంఘటనపై చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఇప్పుడు డా.కదిరే కృష్ణపై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమన్నారు.
మూడు నెలల క్రితం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న కదిరే కృష్ణ, సంస్కృతంలో ఉన్న వేంకటేశ్వర సుప్రభాతాన్ని తెలుగులో అనువదించి చెప్పినందుకు ఆయన మాటలను పలువురు వక్రీకరించారని పేర్కొన్నారు. సమావేశంలో బీసీ హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దేశ్వర్, బీసీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, హైకోర్టు న్యాయవాది పద్మారావు, ఎస్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, ఆర్‌సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బస్వయ్య, తెలంగాణ రాష్ట్ర మాల సంఘం చైర్మన్ చెరుకు రాంచందర్, సునీతగౌడ్, దసురాంనాయక్, ప్రభంజన్ యాదవ్, చాట్ల మణికుమార్, సోగర్స్ బేగం తదితరులు పాల్గొన్నారు.