జర్నలిస్టులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి
ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు
హుజూర్ నగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ ఎదుట హుజూర్ నగర్ నియోజకవర్గ 6టీవీ రిపోర్టర్ సందీప్ పై హత్యాయత్నానికి నిరసనగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలన్నారు.
జర్నలిస్టులపై దాడులు జరిగితే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. 6టీవీ వెచ్చ సందీప్ పై కత్తులతో హత్యాయత్నం చేసిన వ్యక్తులను, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన సందీప్ ను కత్తులతో దాడి చేసి గాయపడిన మతతత్వ వ్యక్తులను అరెస్టు చేసి శిక్షించాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో జర్నలిస్టుల రక్షణ చట్టంపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం డిఎస్పి శ్రీధర్ రెడ్డి, సిఐ చరమందరాజుకి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు దొంతగాని రాజా రమేష్, కీతా సుధాకర్, బసవొజు శ్రీనివాస చారి, కిత రామనాథం, రాంప్రసాద్ గౌడ్, జానీ పాషా, నక్క నరేష్ గౌడ్, నాగుల్ మీరా, త్రిపురం రమేష్ రెడ్డి, ఆత్కూరి వెంకటేశు, పండ్ల నాగరాజు, దేవర వెంకటరెడ్డి, కాంపాటి సందీప్, వసుపు జయరాజు రామయ్య, తండు నరేష్, పండు వెంకన్న, వి6 నరేష్, ఇట్టుమల్ల రామకృష్ణ, నరేందర్, పెందుర్తి సతీషు, బండి నాగేశ్వరావు, జట్టి తేజస్, వట్టికూటి మహేష్ , పాల్గొన్నారు.