19-03-2025 01:05:46 AM
విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
న్యూఢిల్లీ, మార్చి 18: వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజామున నుంచి గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 413 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా 150 మందికిపైగా గాయపడ్డారు. గాజా సిటీ, ఉత్తర గాజా, రఫా, ఖాన్ యూనిస్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 413 మంది ప్రజలు మరణించినట్టు పాలస్తీనా హెల్త్ అధికారులు మీడియాకు వెల్ల డించారు.
మరణించిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలే ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. గాజాలో బందీలుగా ఉన్న 59 మంది విడుదల విషయంలో ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న చర్చలు విఫలమైన నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది.
ఇజ్రాయెల్ మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పం దం కొద్ది రోజుల క్రితం ముగిసింది. రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది.
హమాస్ నిరాకరించినందువల్లే..
ఈజిప్ట్, ఖతార్ నేతృత్వంలో అమెరికా మద్దతుతో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ తమ దేశ పౌరులను విడుదల చేయడానికి హమాస్ నిరాకరించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. ఈ క్రమంలోనే దాడులపై నెతన్యాహు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ నిరాకరించడం వల్లే కాల్పులకు ఆదేశించినట్టు వెల్లడించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును హమాస్ నిరాకరించినట్టు వివరించారు. గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ట్రంప్‌ను ఇజ్రాయెల్ సంప్రదించింది..
గాజాపై దాడులు ప్రారంభించేముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గాన్ని ఇజ్రాయెల్ సంప్రదించిందని శ్వేతసౌధ ప్రతినిధి మీడియాకు తెలియజేశారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ ఉగ్ర చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హమాస్‌తోపాటు ఇరాన్ మద్దతిస్తున్న హౌతీలను ట్రంప్ హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. మరోవైపు గాజాపై దాడులు తిరిగి ప్రారంభం కావడానికి హమాస్ మాత్రమే కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా రాయబారి దోరతి షియా ప్రకటించారు.
ఖండించిన హమాస్
ఇజ్రాయెల్ వైమానిక దాడులను హమాస్ తీవ్రంగా ఖండించింది. దాడులను ప్రారంభించడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ దాడులతో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టినట్టు పేర్కొంది. తాజా దాడులకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అంతేకాకుండా ఈ దాడుల్లో గాజాలోని తమ ప్రభుత్వాధిపతి అస్సామ్ అల్ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించినట్టు హమాస్ ధ్రువీకరించింది. అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖ అధిపతి మహ్మద్ అబు వాట్ఫా, అంతర్గత భద్రతా సేవ డైరెక్టర్ జనరల్ బహ్జత్ అబు సుల్తాన్ సహా కీలక నాయకులు మరణించినట్టు ప్రకటనలో స్పష్టం చేసింది.