calender_icon.png 21 October, 2024 | 12:07 PM

సొంత ఎజెండాతో ప్రభుత్వంపై దాడిl

21-10-2024 12:00:00 AM

కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, అక్టోబర్ 20(విజయక్రాంతి): రాష్ట్రంలో విపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు మూసీ ప్రక్షాళన, హైడ్రా, రైతు భరోసా తదితర సమస్యలపై ప్రజా ఎజెండాతో కాకుండా సొంత ఎజెండాతో ముందుకెళ్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని సీపీఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈరెండు పార్టీలది ఒకటే ఎజెండా గా ఉందని, వారి ఆస్తులను కాపాడుకోడానికే పెద్దఎత్తున రభస చేస్తూ రాబంధుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైడ్రా, మూసీ ప్రక్షాళనలతో పేదలకు నష్టం చేయమని, వారిని ఇబ్బందులకు గురిచేయమని, అక్రమణదారులపై మాత్రమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆక్రమణదారుల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, మజ్లిస్, కాంగ్రెస్ నాయకులుంటే వారి వివరాలు బయటపెట్టాలన్నారు.

దయ్యాలు వేదాలు వల్లించినట్లు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీరు ఉందని, ప్రజలు ఆశీర్వదించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాను మంచికి ఉపయోగిస్తే తామూ మద్దతిస్తామని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చాలని నిర్ణయం తీసుకుంటే వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు.

ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని, రైతుభరోసాను ఈ సీజన్‌లోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. బీసీ కులగణన చేయాల్సిందేనని, ఎస్సీవర్గాల జనాభాను కూడా లెక్కించి వారికి న్యాయం చేయాలన్నారు. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్, బీజేపీలకు లేదన్నారు.