వ్యక్తి పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు.
లింగాల మండలంలో ఘటన.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): అప్పుగా తీసుకున్న 200 తిరిగి ఇవ్వలేదన్న అక్కసుతో ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు కలిసి మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసి చావబాదారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి కురుమయ్య అదే గ్రామానికి చెందిన గుండూరు శ్రీనుతో అవసర నిమిత్తం 200 అప్పుగా తీసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే తిరిగి ఇచ్చేశాడు. కానీ ఇవ్వలేదంటూ తరచూ గొడవ పడుతూ శుక్రవారం ఉదయం ఇంటి వద్ద ఉన్న కురుమయ్యపై శ్రీనుతో పాటు అతని సోదరుడు సైతం పొడవాటి కర్రలతో విచక్షణారహితంగా చావబాదారు. స్పృహ కోల్పోయి పడి ఉండడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు లింగాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని లింగాల పోలీసులు తెలిపారు.