- మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు
- కంటోన్మెంట్ బీజేపీ సభ్యత్వ నమోదులో ఎంపీ ఈటల
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రజల ఓట్లతో గెలిచి వారిపైనే దాడులకు పాల్పడుతుంటూ కేసీఆర్‌ను తరిమినట్లే కాంగ్రెస్ లీడర్లను తరుముతారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం భావన కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదుతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సెక్రటరీ, టీఆర్‌ఎస్‌వీ నాయకులు పోషబోయిన కుమార్ యాదవ్ ఇతర ముఖ్య నాయకులు ఆదివారం బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇండ్లను కూలగొట్టి కార్పొరేట్ కంపెనీలకు ఆ భూములను కట్టబెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. మూసీలో మురికి నీటికి బదులుగా తాగే నీరు పారాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచి ప్రజలపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ప్రధాని మోదీకి మద్దతుగా నిలవాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో బీజేపీకి వచ్చిన ఓట్లలో 50 శాతం సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు.
కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుమల రెడ్డి, నాగారం మున్సిపల్ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్‌గౌడ్, నాగారం ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.