calender_icon.png 6 October, 2024 | 8:11 AM

గొర్రెల కాపరులపై దాడి

05-10-2024 12:16:53 AM

ముగ్గురికి తీవ్రగాయాలు

చేవెళ్ల, అక్టోబర్ 4: సంచార గొర్రెల కాపరులపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నారా యణపేట జిల్లాకు చెందిన గొల్ల చంద్రప్ప, మరో ముగ్గురు గొర్రెల కాపరులు 200కు పైగా గొర్రెలను మేపుకొంటూ గురువారం చేవెళ్ల మండలం పామెన గ్రామం పరిధిలోకి వచ్చారు.

గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో గడ్డి మేపుతుండగా.. అదే గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి, చేవెళ్ల గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి కర్రలతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తాము రైతును అడిగే మేపుతున్నామని, వెళ్లిపోతామని కాళ్లమీద పడ్డా వినలేదు. వీరితో పాటు గొర్రెలపైనా దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో ముగ్గురు కాపరులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇందులో చంద్రప్ప చేయి విరిగినట్లు తెలిసింది. గమనించిన స్థానికులు వెంటనే వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక గొల్లకురుమ సంఘాల నేతలు వారితో శుక్రవారం చేవెళ్ల పీఎస్‌లో ఫిర్యాదు చేయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ రెడ్డి తెలిపారు. కాగా, ఇదే వ్యక్తులు గతంలోనూ గొర్రెల కాపరులను కొట్టారని, పదిరోజుల కింద అదే గ్రామానికి చెందిన కొందరి బర్రెలపై, కాపరులపైనా దాడి చేసి పారిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.