హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (విజయక్రాంతి) : హైదరాబాద్ మీర్పేట్లోని లెనిన్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. సినీ హీరో పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై గురువారం పలువురు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్ తన భార్య సరిత, ఇద్దరు పిల్లలతో కలిసి గత ఐదు సంవత్సరాలుగా లెనిన్ నగర్లో నివసిస్తున్నాడు. ఎదురింట్లో నివాసముండే రాజు, అతని బంధువులు వెంకట్ కూతరు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో గొడవ చోటుచేసుకుంది.
తన కూతురు పట్ల అసభ్యం గా ప్రవర్తించడంతో వెంకట్ భార్య సరిత.. రాజుపై చేయి చేసుకుంది. దీంతో రాజు బంధువు వెంకట్ ఇంటి మందున్న బైక్‌ని తగలబెట్టి, కర్రలు, ఇటుకలు, ఇనుపరాడ్లతో దాడి చేశాడు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, వెంకట్ కుటుంబ సభ్యులపై భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకున్న మీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.