calender_icon.png 26 November, 2024 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సునీత ఇంటిపై దాడి

24-09-2024 03:03:58 AM

గోమారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య అర్థరాత్రి ఘర్షణ

మెదక్/శివంపేట, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై ఆదివారం అర్థరాత్రి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో భగత్‌సింగ్ అసోసియేషన్ వారు వినా యక నిమజ్జనం నిర్వహించగా ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటివద్దకు రాగానే కాంగ్రెస్ కార్యకర్తలు భారీఎత్తున టపాకాయలు కాలుస్తూ గంద రగోళం సృష్టించారు.

టపాకాయలు ఇంట్లో పడుతున్నాయని ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తులు వారించడంతో వారిపై దాడికి పాల్పడి గాయపర్చారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరిని ఒకరు దూషించుకుంటూ తోపులాటకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న శివ్వంపేట పోలీసులు గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను శాంతిపజేయడానికి ప్రయత్నించగా ఓ హెడ్‌కానిస్టేబుల్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించినట్లు బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. సోమవారం ఎమ్మెల్యే సునీతారెడ్డి గ్రామానికి చేరుకొని ఘటన విషయంపై కార్యకర్తలతో సమీక్షించారు. తన ఇంటిపై జరిగిన దాడి విషయమై జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేశారు. 

పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదు: సునీతారెడ్డి

గోమారం గ్రామంలో గత 30 ఏళ్ళుగా ఎలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని, గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. గ్రామంలో కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారని, ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి నా అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్ళు, కర్రలతో ఇంట్లో ఉన్న వారిపై దాడికి దిగినట్లు చెప్పారు. దాడి  చేసినవారితో పాటు ఘటనకు ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలవడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. 

వాకబు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

గోమారం గ్రామంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌లో ఎమ్మెల్యేను పరామర్శించారు. దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.

కేసు నమోదు చేశాం: జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి

శివంపేట మండలం గోమారం గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటివద్ద గొడవ చేసి దాడికి పాల్పడిన భగత్‌సింగ్ అసోసియేషన్ వినాయక నిమజ్జన మండలి వారిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి తెలిపారు. విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా శివంపేట పోలీసులు మాత్రం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఇవి ఫ్యాక్షన్ రాజకీయాలు మాజీ మంత్రి హరీశ్‌రావు 

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ గుండాల రాజ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మారుస్తున్నారని, గత పదేళ్ళలో లేని ఫ్యాక్షన్ గొడవలు ఇప్పుడు ఎందుకు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఆదివారం అర్థరాత్రి శివంపేట మండలం గోమారం గ్రామంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడి విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకొని ఎమ్మెల్యేను పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాసేలా ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నదని విమర్శించారు.

సీఎం రెచ్చగొట్టే మాటలవల్లే కాంగ్రెస్ నాయకులు గుండాల్లా  వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్నారు. ఇంటి ముందు కావాలనే టపాకాయలు కాలుస్తూ వద్దని వారించిన వారిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. తాను జిల్లా ఎస్పీ, ఐజీతో మాట్లాడానని వెంటనే కాంగ్రెస్ గుండాలపై కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభాసుపాలవుతున్నారని విమర్శించారు.

తమ హయాంలో ఫిర్యాదు చేసిన 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవారని, సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసి కోర్టుకు సైతం వెళ్తామని హరీష్‌రావు హెచ్చరించారు.

ఈ ఘటనపై తెలంగాణ డీజీపి తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరిపించి కాంగ్రెస్ గుండాలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ఎర్రోల్ల శ్రీనివాస్, నాయకులు దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.