calender_icon.png 17 March, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌లో మిలటరీ కాన్వాయ్‌పై దాడి

17-03-2025 12:16:53 AM

  1. ఏడుగురు సైనికుల మృతి.. 21 మందికి తీవ్ర గాయాలు
  2. పాక్ అధికారుల వెల్లడి
  3. దాడికి బాధ్యత వహించిన బీఎల్‌ఏ
  4. 90 మంది సైనికులను హతమార్చినట్టు ప్రకటన

న్యూఢిల్లీ, మార్చి 16: పాక్ మిలటరీ కాన్వాయ్‌పై ఆదివారం జరిగిన మెరుపు దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా మరో 21 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని పాక్ అధికారులు స్పష్టం చేశారు. ‘ఏడు బస్సులు, మరో రెండు వాహనాల్లో భద్రతా బలగాలు క్వెట్టా నుంచి టఫ్టాన్‌కు వెళ్తుండగా దాడి జరిగింది.

ఐఈడీలతో కూడిన ఓ వాహనం కాన్వాయ్‌లోని బస్సును ఢీ కొట్టింది. బహుశా ఇది ఆత్మాహుతి దాడి కావొచ్చు. ఇదే సమయంలో మరో వాహనంపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్లతో దాడి జరిగింది’ అని పాకిస్థాన్ అధికారి ఒకరు ప్రకటనలో పేర్కొన్నారు. గాయపడ్డ వారిని ఆర్మీ హెలికాప్టర్‌ల సహాయంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

అలాగే దాడి జరిగిన చోట డ్రోన్లతో నిఘా పెట్టినట్టు చెప్పారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ దాడిని ఆత్మాహుతి దాడిగా నోష్కీ స్టేషన్ ఆఫీసర్ జఫరుల్లా సులేమానీ పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 

90 మందిని హతమార్చాం

మిలటరీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఈ దాడిలో 90 మంది పాక్ సైనికులు మరణించినట్టు వెల్లడించింది. ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్, ఫిదాయి యూనిట్లు నోష్కీలోని ఆర్‌సీడీ వెంబడి వెళ్తున్న పాక్ మిలటరీ కాన్వాయ్ లక్ష్యంగా దాడులు జరిపాయి.

ఈ కాన్వాయ్‌లో మొత్తం ఎనిమిది బస్సులు ఉండగా ఒక బస్సు పూర్తిగా ధ్వంసమైంది’ అని ప్రకటనలో తెలిపింది. ఆ వెంటనే తమ బృందం మరో బస్సును చుట్టుముట్టి అందులో ఉన్న సైనికులను హతమార్చినట్టు వెల్లడించింది. దీంతో ఆదివారం జరిగిన దాడిలో మరణించిన సైనికుల సంఖ్య 90కి చేరిందని బీఎల్‌ఏ స్పష్టం చేసింది.