calender_icon.png 20 November, 2024 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ డైరెక్షన్‌లోనే కౌశిక్ ఇంటిపై దాడి

14-09-2024 03:30:00 AM

  1. ఎన్నికే లేకుండా పీఏసీ చైర్మన్ ఎన్నికా?
  2. తెలంగాణ ఇమేజ్‌పై సీఎం మాట్లాడడమా?
  3. మాజీ మంత్రి హరీశ్ రావు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై గురువారం దాడి జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ దాడి గాంధీ చేసింది కాదని.. ముమ్మాటికి  రేవంత్ రెడ్డి చేసిన దాడిగానే భావిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, గాంధీల వివాదం నేపథ్యంలో హౌజ్ అరెస్టు అయిన హరీశ్‌రావు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదపు తప్పడానికి చేయాల్సిందంతా చేసి హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి సీఎం మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని సీఎం, డీజీపీలు ఎందుకు ఆపలేకపోయారని, అప్పుడు వీళ్లకు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే దారుణ  పరిస్థితులు ఉన్నాయన్నారు.  ఫిరాయింపులపై సీఎం ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికే లేకుండా పీఏసీ చైర్మన్ ఎన్నిక జరిగిందని చెప్పడం రేవంత్‌రెడ్డి చెప్పడం దుర్మార్గం అని అన్నారు. సీఎం డ్రామాల తీరుతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. రేవంత్‌ది అన్నింటిలోనూ యూ టర్న్ విధానమేనని ఎద్దేవా చేశారు.

డీజీపీ కూడా ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడటం దుర్మార్గం అని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి బీఆర్‌ఎస్ కార్యకర్తలను కొట్టాలని రెచ్చగొట్టేలా మాట్లాడటం అంటే 9 నెలల పాలనలో శాంతి భద్రతలు పాతాళానికి చేరుకున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ దేశం బయట స్వేచ్ఛ, స్వాతంత్య్రాల గురించి లెక్చర్లు ఇవ్వడం మానేసి తెలంగాణలో  మీ పార్టీ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల మీద మాట్లాడాలని హితవు పలికారు.  మీరు విసిరే ప్రతి రాయి బీఆర్‌ఎస్ తిరిగి అధికారానికి పునాది రాళ్లు అవుతాయని హెచ్చరించారు.  వివాదంలో ముందుగా రెచ్చగొట్టింది గాంధీయేనని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని  డిమాండ్ చేశారు.

ఏఐజీలో  హరీశ్‌రావుకు చికిత్స

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఎమ్మెల్యే  కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిని నిరసిస్తూ  సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న క్రమంలో హరీశ్‌రావును, బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో హరీశ్‌రావు భుజానికి తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీ ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయమే హరీశ్ రావును పోలీసులు గృహ నిర్భందం చేశారు.

అప్పటికే భుజం నొప్పితో బాధపడుతున్న హరీష్ తాను ఆస్పత్రికి వెళ్లాలని పోలీసులను కోరారు. అందుకు పోలీసులు ఒప్పుకోక పోవడంతో పోలీసులకు, హరీశ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీస్ ఎస్కార్ట్ మధ్య ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎమ్మారై స్కాన్ తీసిన డాక్టర్లు 15 రోజులు ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు.అనంతరం అక్కడి నుండి తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.