మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన, కలెక్టర్ కు వినతి...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ లో కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై హీరో మోహన్ బాబు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టు జేఏసీ, టీయుడబ్ల్యుజే (ఐజేయు), టీయుడబ్ల్యుజే (హెచ్-143), టీయుడబ్ల్యుజేఎఫ్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఇకపై జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం భరోసా కల్పిస్తూ, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఉన్నారు.