10-03-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మార్చి 9: అమెరికాలోని హిందూ ఆలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. కాలిఫోర్నియా చినో హిల్స్‌లోని బాప్స్ శ్రీ స్వామినారాయణ ఆలయం గోడలపై భారత వ్యతిరేక సందేశాలు రాశారు. హిందువులు తిరిగి వెళ్లిపోవాలంటూ గ్రాఫిటీ వేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా బాప్స్ ధ్రువీకరిస్తూ ద్వేషానికి హిందూ సమాజం వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఈ ఘటనను భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రత పెంచాలని స్థానిక పోలీసు అధికారులను కోరింది. మరోవైపు ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేయించాలంటూ ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్‌ను హిందూ అమెరికన్ ఫండేషన్ ఎక్స్ ఖాతా ద్వారా కోరింది. అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో జరుగుతున్న మతపరమైన దాడుల జాబితాలో హిందూ వ్యతిరేక దాడులు రెండోస్థానంలో ఉన్నాయి.