అనుమతులు లేకుండా అందరూ విధులకు డుమ్మా
కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి
కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు.. రెగ్యులర్ ఉద్యోగుల సస్పెన్షన్
నల్లగొండ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అందరిపై ఒకేసారి వేటు పడింది. అనుమతి లేకుండా ఒకేరోజు అంతా విధులకు డుమ్మా కొట్టడంతో కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకున్నారు. బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి గుర్రంపోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌తో సహా సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. దవాఖానలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఫార్మిసిస్ట్ శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి, అటెండర్లు శ్రీనివాస్, అరుణ జ్యోతి, ఎల్లమ్మలను వెంటనే ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులు అటెండర్ లక్ష్మీనారాయణ, ఫార్మసిస్ట్ భాగ్యమ్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.