calender_icon.png 24 November, 2024 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్క నెపంతో కుటుంబంపై దాడి

17-05-2024 02:27:30 AM

రహ్మత్‌నగర్‌లో దారుణం

పెంపుడు కుక్క, యజమాని కుటుంబానికి తీవ్రగాయాలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (విజయక్రాంతి) : నేటి సమాజంలో ఇరుగుపొరుగు  బద్ధ శత్రువుల్లా మారుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి నగరంలో గురువారం చోటుచేసుకుంది. ఓ పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారి, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. కుక్కను తమ ఇంటిపైకి ఉసిగొల్పావంటూ కోపంతో కుటుంబంపై కర్రలతో దాడి చేసింది మరో కుటుంబం. ఈ ఘటన రహ్మత్‌నగర్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న మధు కుటుంబం ఒక కుక్క పిల్లను పెంచుకుంటుంది. ఈ నెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు కుటుంబసభ్యులంతా కలిసివెళ్లారు. ఆ సమయంలో పెంపుడు కుక్క వీరితో పాటు బయటకు వచ్చి.. నిర్మాణంలో ఉన్న ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్లింది. ఈ క్రమంలో కుక్కను తమపైకి ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులు గొడవకి దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

ఈ ఘటనతో కోపం పెంచుకున్న ధనుంజయ్ ప్రతీకారంతో రగిలిపోయాడు. దాడి చేసేందుకు అవకాశం కోసం వేచి చూశాడు. మంగళవారం సాయంత్రం మధు సోదరుడు శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్‌కు బయలుదేరగా.. ఇది చూసిన ధనుంజయ్ మరో నలుగురితో కలిసి వచ్చి ఇంటి గేటు వద్ద ఉన్న కుక్కను ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ధనుంజయ్ సహా ఐదుగురు వ్యక్తులు మూకుమ్మడిగా మధు కుటుంబీకులపై కర్రలతో దాడి చేశారు.

ఈ దాడిలో మధు సోదరుడు శ్రీనాథ్‌తో పాటు అతడి తల్లి రాజేశ్వరి, అతడి భార్య స్వప్న తీవ్రంగా గాయ పడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు. దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.