calender_icon.png 16 January, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి తగాదాలతో అన్నపై దాడి

03-07-2024 12:05:00 AM

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

జహీరాబాద్, జూలై 2: ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నపై తమ్ముడు, అతని కుమారుడు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మల్గి గ్రామంలో చోటుచేసుకుంది. హద్నూర్ పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్గి గ్రామానికి చెందిన తెలుగు జగన్నాథ్, బాబు, వైద్యనాథ్, కంటెప్ప అన్నదమ్ములు. బాబు తన తల్లి పేరిట ఉన్న ఇంటిని సోదరులతో ఒప్పందం కుదుర్చుకొని రూ.10 లక్షలకు కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలని అన్నదమ్ములను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదు.

ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం గ్రామంలోని ఓ హోటల్ వద్ద బాబు, తమ్ముడు వైద్యనాథ్, అతని కుమారుడు రవి కలిసి ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో గొడవపడ్డారు. దీంతో బాబుపై తమ్ముడు వైద్యనాథ్, రవి కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం బీదర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ సీఐ నయిమోద్దీన్, హద్నూర్ ఎస్సై రామనాయుడు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.