24-02-2025 07:22:08 PM
ఐటీడీఏ గిరిజన దర్బార్ కు వచ్చిన లబ్ధిదారులను కోరిన పిఓ..
భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన దర్బార్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చే ఆదివాసి గిరిజనులు వారికి సంబంధించిన అన్ని గుర్తింపు పత్రాలు పొందుపరచి దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ, ప్రతి గిరిజన కుటుంబాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఎక్కువ శాతం అర్జీలు పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భూసమస్యలు, కిరాణాషాపులు, ఫ్యాన్సీ స్టోర్లు రుణాల కొరకు, ట్రై కార్ ద్వారా లభించే సబ్సిడీ రుణాల కొరకు, కరెంటు, బోరు మోటారు ఇప్పించుట కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి స్వయం ఉపాధి రుణాలు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో కరెంటు సౌకర్యం కొరకు, ఒంటరి మహిళ, వితంతు మహిళ ప్రోత్సాహాల కొరకు, గిరిజన రైతులకు రైతుబంధు రుణాలు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించుకోవడానికి శిక్షణలు ఇప్పించుట కొరకు, తమ పంట పొలాలలో సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించుట కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం అందించడం కొరకు, దీర్ఘకాలిక జబ్బులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కల్పించుట కొరకు దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు.
అశ్వరావుపేట మండలంకు చెందిన గ్రామస్తులు కరెంటు బోరు మోటారు ఇప్పించుట కొరకు, ఇల్లందు మండలంకు చెందిన గ్రామస్తులు ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇప్పించుట కొరకు, పినపాక మండలంకు చెందిన సాంబయ్య పోడు భూములలో కరెంటు సౌకర్యం ఇప్పించుట కొరకు, టేకులపల్లి మండలంకు చెందిన వినీల నర్సింగ్ కళాశాలలో సీటు ఇప్పించుట కొరకు, ములకలపల్లి మండలం మూక మామిడి గ్రామానికి చెందిన నానయ్య ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలల్లో కాంట్రాక్టు పనులు ఇప్పించుట కొరకు, దమ్మపేట మండలం రెడ్డియాలపాడు గ్రామానికి శ్రీవిద్యపై చదువులకు ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, అశ్వాపురం మండలం చెందిన గ్రామస్తులు సోలార్ విద్యుత్ ద్వారా పంట పొలాలలో కనెక్షన్ ఇప్పించుట కొరకు, చర్ల మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పడిదయ్య కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించుట కొరకు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ లో దాదాపు 250 కి పైగా దరఖాస్తులు వచ్చాయని అన్నారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ప్రత్యేకంగా ఆన్లైన్లో నమోదు చేసి, విడతల వారీగా వారి దరఖాస్తులను పరిష్కారమయ్యేలా చూస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఆర్సిఓ గురుకులం నాగార్జున రావు, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఏవో సున్నం రాంబాబు, ఏడి అగ్రికల్చర్ భాస్కర్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, పివిటిజి అధికారి మనిధర్, మిషన్ భగీరథ ఏఈఈ నారాయణరావు, డిటిఆర్ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఏపీవో పవర్ వేణు, మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, హెచ్ ఇ ఓ లింగ నాయక్, డిఎం జీసీసీ విభాగం భార్గవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ జర్ రాజేశ్వరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.