బీసీ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందిస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్, ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బడేసాబ్
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): బీసీలపై దాడులకు పాల్పడుతూ కులం పేరుతో కులవృత్తులను, కులాలను తిడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని అందుకే ఏపీలో అమలు చేసినట్లుగా తెలంగాణలోనూ బీసీలకు అట్రాసిటీ చట్టం ద్వారా రక్షణ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ను కలిసి వినతిపత్రం అందించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట కార్యదర్శి జాజుల లింగంగౌడ్, ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షులు బడేసాబ్ తెలిపారు.
కొన్ని బీసీ కులాలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని, గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో కొన్ని కులాలను గ్రామ బహిష్కరణ చేసిన సందర్భాలూ ఉన్నాయని లింగంగౌడ్ పేర్కొన్నా రు. కొన్ని గ్రామాల్లో రజకులు తప్పకుండా బట్టలు ఉతకాల్సిందేనని వీడీసీలు తీర్మానాలు చేస్తున్నాయని, సమ్మతించని వారిపై గ్రామ బహిష్కరణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వం వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని బీసీల కోసం ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన కోరారు.