calender_icon.png 23 October, 2024 | 5:02 AM

అయ్యో పాపం

05-05-2024 12:10:05 AM

అప్పుడే పుట్టిన పసికందును వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు 

హనుమకొండ జిల్లాలో దారుణం

హనుమకొండ, మే 4 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసిగుడ్డును రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఎండ వేడికి గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పసికందును ట్రాక్టర్ డ్రైవర్ గుర్తించడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దామెర మండలం ఊరుగొండలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఊరుగొండ గ్రామంలో వరంగల్ జాతీయ రహదారిపై కల్వర్టు నిర్మాణ పనులు సాగుతున్నాయి. శనివారం ఉదయం గ్రామంలోని పెద్ద చెరువు సమీపంలో ఉన్న స్కూల్ వద్ద వాటర్ ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ రోడ్డుపక్కన అచేతనంగా పడి ఉన్న పసికందును గమనించాడు. వెంటనే ఆ పక్కనే పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు విషయం చెప్పాడు.

దీంతో వారు స్థానిక ఎస్సై అశోక్‌కు సమాచారం ఇచ్చి మట్టిలో కూరుకుపోయిన బొడ్డు ఊడని పసికందును బయటకు తీసి సపర్యలు చేశారు. ఆ పసిపాపను శుభ్రం చేసి పోలీస్ వాహనంలో ఆరెపల్లిలోని ఎన్‌ఎస్‌ఆర్ అపోలో ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం ఆ శిశువును మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి కొద్దిదూరంలో పింక్ పంజాబీ ప్యాంట్‌ను గుర్తించామని, పూర్తి ఆధారాల కోసం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.