calender_icon.png 23 November, 2024 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొలం కోసం మర్మంగాలు కోసి.. ప్రాణం తీసి..

23-11-2024 07:18:53 PM

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం..

ఇంటి నిర్మాణం కోసం పొలం అమ్మకానికి పెట్టాడని.. మర్మాంగాలను కోసి హతమార్చిన భార్యా పిల్లలు..

పరారీలో నిందితులు..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నూతన ఇంటి నిర్మాణంతో పాటు తన పిల్లలకు పెళ్లిళ్లు చేయాలన్న ఉద్దేశంతో ఆ ఇంటి యజమాని తనకు ఉన్న పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. అది ఇష్టంలేని కట్టుకున్న భార్యతో పాటు రక్తం పంచుకు పుట్టిన కూతురు, అల్లుడు ఇతర కుటుంబ సభ్యులు కలిసి అత్యంత దారుణంగా గొడ్డలితో హతమార్చి మర్మంగాలను కోసి పరారయ్యారు.

ఈ దారుణమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. డిఎస్పి బుర్రి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం... వట్టిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (56)కు గ్రామ శివారులో తనకున్న 2.14 గుంటల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఐదు మంది కూతుళ్ళలో ఇద్దరికీ పెళ్లిళ్లు చేయగా మరో ముగ్గురు పెళ్లికి ఉన్నారు. దీంతో పూరి గుడిసెను తొలగించి నూతన ఇంటి నిర్మాణంతో పాటు ముగ్గురు పిల్లల పెళ్లిళ్ల ఖర్చులకై తనకున్న పంట పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. దాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భోజనం అనంతరం ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించగా శనివారం మధ్యాహ్నం సమయం వరకు ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు ఇంట్లో వెళ్లి చూడగా ఈశ్వరయ్య రక్తపు మడుగులో ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని హత్యకు ఉపయోగించిన గొడ్డలితో పాటు పలు ఆధారాలను సేకరించారు. గొడ్డలితో దాడి చేసి మర్మాంగాలను కూడా కోసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భూమి అమ్మకాన్ని వ్యతిరేకించిన భార్య ఎల్లమ్మ, పెద్ద కుమార్తె స్వాతి, అల్లుడు మల్లేష్, భార్య సోదరుడు తన బావమరిది బాలస్వామి, భార్య సోదరి తన మరదలు ఆశమ్మలు కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు మృతుడి చెల్లెలు నిర్మల ఆరోపించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు డిఎస్పి తెలిపారు.