calender_icon.png 4 February, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోపాల్ పాపానికి ప్రాయశ్చిత్తం

04-02-2025 12:00:00 AM

దేశ చరిత్రలో అత్యంత దారుణమైన పారిశ్రామిక ప్ర మాదాన్ని చవిచూసిన నగరం భోపాల్. 1984 డిసెంబర్ 2వ తేదీ రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారం నుండి అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ కావడం వలన నగరంలో ఎక్కడి జనాలు అక్కడే విగతజీవులుగా మారారు.

అసలు ఏమి జరుగుతుం దో తెలియక, ఎందుకు చనిపోతున్నామో తెలియక నిమిషాల వ్యవ ధిలో దాదాపు 5480 మంది ఎక్కడివారు అక్కడే చనిపోయారు. ఆరో జు రాత్రి లెక్కలలోకి రాకుండా దాదాపు 25000 మంది చనిపోయినట్లు అనధికార లెక్కలు చెబుతు న్నాయి. లక్షలాది మంది ఇప్పటికీ దీని ప్రభావంతో బాధపడుతూనే ఉన్నారు.

ఈ గ్యాస్ ప్రమాదం 5,58,125 మందిపై ప్రభావం చూపిందని 2006లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో పేర్కొంది. గ్యాస్ ప్రమాదం జరిగిన తరువాత యూనియన్ కార్బైడ్ కంపెనీ యజమాని ప్రభుత్వ సహకారంతో దేశం విడిచివెళ్లారు.

గ్యాస్ ప్రమాద బాధితులు మాత్రం పరిహారం కోసం పోరాటాలు చేస్తూ వుండిపోయారు. బాధితులు ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ, కోర్టుల చుట్టూ పరిహా రం కోసం తిరుగుతున్నారు. కనీసం సంఘటన జరిగి దశాబ్దాలు గడిచినా ప్రమాద స్థలిలోని విషపూరిత వ్యర్థాలను తరలించలేదు.

ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన 40ఏళ్ల తరువాత సుప్రీంకోర్టు మందలింపుతో బాధిత నగరం భూ పాల్‌లో విషవ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఈ ఏడాది జనవరి 1వ తేది రాత్రి కర్మాగారంలో మిగిలిపోయిన అత్యంత ప్రమాదకర వ్యర్ధాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.

దాదాపు 340 టన్నుల వ్యర్థా లను ప్రత్యేకమైన కంటైనర్లలో జాగ్రత్తగా పెట్టి నగరానికి 250 కిలోమీ టర్ల దూరంలోని ధర్ జిల్లాలో వున్న ప్రీతంపూర్ పారిశ్రామికవాడకు తరలించారు. అక్కడ ఈ వ్యర్థాలను దహనం చేసి, విషపూరితమైన పదార్థాలు లేవని నిర్ధారణ చేసుకున్నాకే మిగిలిన అవశేషాలను నేలలో పాతిపెట్టనున్నామని అధికారులు  తెలి పారు.

ప్రీతంపూర్ పారిశ్రామికవాడలోని వ్యర్థాల దహన కర్మాగారం రాష్ట్రంలోనే ఏకైక అత్యాధునిక కర్మాగారం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు. 2015లో ట్రయల్‌ర న్‌లో భాగంగా గంటకు 90 కిలోల వ్యర్థాల చొప్పున 10 టన్నుల విషవ్యర్థాలను కాల్చేయగలిగారు.

దీంతో ఇప్పుడు భూమికి 25 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రత్యేక వేదికపై వ్యర్థాలను కాల్చనున్నారు.  ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 153 రోజులు పడుతుందని అంచనా.

 మోతె రవికాంత్