18-04-2025 11:27:09 PM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నాక ఆ దేశభద్రతకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. ఇప్పటికే వీసాల జారీ ప్రక్రియ జఠిలంగా మారిందని అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల్లో విస్తృతమైన కథనాలు ప్రసారమవుతున్నాయి. తాజాగా మరో అంశం తెరమీదకు వచ్చింది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) విభాగానికి ఉన్న ప్రత్యేక అధికారాలపై చర్చ నడుస్తున్నది.
అధికారాలు ఇలా..
అమెరికాలోని ఏ విమానాశ్రయం, ఏ నౌకాశ్రయం నుంచి బయటకు వస్తున్న వ్యక్తితో పాటు అతడి వెంట తెచ్చుకునే వస్తువులను తనిఖీ చేసే అధికారం సీబీసీకి ఉంటుంది. ఆ వస్తువులు సాధారణమైనవైనా, గ్యాడ్జెట్లునా.. వేటినీ వదిలిపెట్టే సమస్యేలేదు. అమెరికాకు చేరిన వ్యక్తికి వీసా ఉన్నా, గ్రీన్ కార్డు ఉన్నా.. చెకింగ్‌కు ఎవరూ అతీతులు కారు. ఆఖరికి అమెరికన్ పౌరుడైనా చెకింగ్ విషయంలో సీబీసీకి సహకరించాల్సిందే. అందుకు సీబీసీకి ప్రత్యేకంగా వారెంట్ కూడా అవసరం లేదు. అధికారులు మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ల వంటి ప్రతి గ్యాడ్జెట్‌ను చెక్ చేస్తారు. అవసరమైతే వాటిలోని డాటాను సేకరించి, విశ్లేషిస్తారు. అధికారులు తనిఖీ చేసేది ఒకవేళ మొబైల్ అయితే.. సదరు వ్యక్తి కచ్చితంగా మొబైల్‌ను అన్‌లాక్ చేయాలి.. లేదా మొబైల్ పాస్‌వర్డ్ చెప్పితీరాల్సిందే. లేదంటే సీబీసీ సదరు వ్యక్తిని దేశంలో ప్రవేశించకుండా నిలిపివేసే ప్రమాదం ఉంది.
డాటా విశ్లేషణలో ఒకవేళ అసాంఘిక పనులు, దేశ భద్రతకు భంగం వాటిల్లే సమాచారం ఏదైనా లభిస్తే, గ్యాడ్జెట్ యజమానిపై చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సీబీసీ సిఫార్సు చేస్తుంది. అవసరమైతే ఆ గ్యాడ్జెట్‌ను ఐదురోజుల పాటు లేదా తీవ్రత ఎక్కువ ఉంటే మరిన్ని రోజులు గ్యాడ్జెట్‌ను వారి వద్దే పెట్టుకునే అవకాశం ఉంది. సీబీసీ అధికారులు ఏదైనా గ్యాడ్జెట్‌ను వెంట తీసుకువెళితే, దాని యజమాని వారి నుంచి కచ్చితంగా రశీదు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారెప్పుడు తిరిగి సీబీసీ సంప్రదించాలో అడిగి తెలుకోవాల్సి ఉంటుంది. గ్యాడ్జెట్‌లో దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రమాదకర సమాచారం లేకపోతే, సీబీసీ తిరిగి దానిని యజమానికి అప్పగించొచ్చు. కాబట్టి అమెరికా వెళ్లేవారందరూ సీబీసీ ఉండే ప్రత్యేక అధికారాల గురించి తెలుసుకుంటే ఎంతో మంచిది. తద్వారా అక్కడికి వెళ్లకముందే తగు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.