- రూ.17 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
కామారెడ్డి జిల్లా పిట్లంలో ఘటన
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే!
కామారెడ్డి, జనవరి 12 (విజయక్రాంతి): ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి, అందులో ఉన్న రూ.17 లక్షలకు పైగా నగదు దోచుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా పిట్లంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మూడుగంటల సమయంలో పిట్లంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేశారు.
అందులో ఉన్న రూ.17 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి, బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణగౌడ్, సీఐ రాజశేఖర్, పిట్లం ఎస్సై రాజు, నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. గతంలో కూడా జిల్లాలో ఇదే తరహాలో మూడు సంఘటనలు జరిగాయి.
ఇది నాలుగో ఘటనగా పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలను పగులగొట్టి భారీ చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే కామారెడ్డి జిల్లా జంగంపల్లి యూనియన్ బ్యాంక్ ఏటీఎం, బ్యాంకుల్లో భారీ మొత్తం లో చోరీ జరిగింది. ఈ ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో ఏటీఎంను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగి ఏడాది కావస్తున్నా ఇంత వరకు దుండగులను పట్టుకోలేదు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో ఆరు నెలల క్రితం ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. నిజామాబాద్ జిల్లా బాల్కోండ మండల కేంద్రంలోని ఏటీఎంను ధ్వంసం చోరీకి పాల్పడ్డారు. తాజాగా పిట్లం మండల కేంద్రంలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డాడరు.
జాతీయ రహదారుల వెంబ డి ఉన్న ఏటీఎంలనే దుండగులు టార్గె ట్ చేసుకుంటున్నారు. వాహనాల్లో వచ్చి దర్జా గా చోరీకి పాల్పడుతున్నారు. కారులో వచ్చి దర్జగా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి పాల్పడుతున్నారు. ఈ నాలుగు ఘటనల్లోనూ ఒకే ముఠా హస్తం ఉండి ఉం టుందని పోలీసులు అనుమానిస్తున్నారు.