calender_icon.png 19 November, 2024 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవార్డుల కమిటీలో అతివలేరి?

25-08-2024 01:52:37 AM

  1. ఒక్కరే స్త్రీ.. మరొక్కరుంటే ఒట్టు! 
  2. మహిళా ప్రాధాన్యంపై ప్రభుత్వం పక్షపాతం

ఆ అవార్డు తెలుగు సినీ కళాకారులకెంతో ప్రతిష్టాత్మకం. ఇల్లంతా అవార్డులతో నిండి ఉన్నా ఆ ఒక్కటి దక్కలేదన్న వెలితి ప్రతిభావంతులకు ఎప్పుడూ ఉంటుంది. పలానా సినిమాలో మీ నటనకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కిందని ఎవరైనా గుర్తు చేస్తుంటే.. ఒకింత గర్వం, రెట్టించిన ఆనందంతో కళాకారులు ఉప్పొంగిపోవటం పరిపాటి. తాను పురస్కారం పొందిన ఏడాది అవార్డుల ఎంపిక కమిటీని సైతం ఆ క్షణాన కళాకారులు గుర్తు చేసుకోవటం రివాజు. అందులో పురుషులు ఎంత మంది? మహిళలు ఎందరు? అనేది లెక్కలేసుకుంటారు. మరి, ఆ లెక్కలు సరి చూసుకున్న తర్వాతే ‘గద్దర్ అవార్డు’ల కమిటీని ప్రకటించారా? అంటే, తెలంగాణ సర్కారు సమాధానం ఏం చెప్తుంది?! 

సినీ కళాకారులకిచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏడేళ్లుగా మరుగున పడ్డాయి. తాజాగా ఈ అవార్డుల ప్రదానోత్సవానికి తెర తీసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అవార్డుకు నామకరణం చేయడం, ఎంపిక కమిటీ నియామకం చకచకా జరిగిపోయాయి. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు తీరు ఆదిలోనే హంసపాదు అన్న చందంగా తయారైంది. ‘గద్దర్ అవార్డు’ల కమిటీలో మహిళలకు ప్రాధాన్యం కల్పించటంలో రేవంత్ సర్కారు విఫలమైందన్న అసంతృప్తి అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.

నంది అవార్డుల ప్రదానం 1964లో ప్రారంభమైంది. దాదాపు యాభై ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రంలో ఈ పురస్కారాల పరంపర కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డు తర్వాత సినిమా రంగంలోని ప్రతి ఒక్కరు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డును ఎంతో గౌరవంగా భావిస్తుంటారు. అలాంటి అవార్డుల విషయంలో తెలంగాణ తొలి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2017 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలూ అవార్డులు ఇవ్వడం ఆపేశాయి. ఎట్టకేలకు తెలంగాణలో మూ డో ప్రభుత్వంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ఆ అవార్డుల ఆనవాయితీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవటం ముదావహం. ఉమ్మడి రాష్ట్రంలో ‘నంది’ పేరుతో ఇచ్చిన పురస్కారాలకు ప్రస్తుత ప్రభుత్వం ‘గద్దర్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు అవార్డుల ఎంపిక కమిటీని సైతం నియమించింది. 

ఇదేనా మహిళలకిచ్చే గుర్తింపు?

గద్దర్ అవార్డుల కమిటీలో మహిళా సభ్యుల భాగస్వామ్యం లేకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 16 మందితో కమిటీని ప్రకటించిన సర్కారు అందులో మహిళా సభ్యులను చేర్చడంలో విఫలమైంది. గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెల తప్ప మిగతా 15 మంది పురుషులే కావటం గమనార్హం. ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావును చైర్మన్‌గా, నిర్మాత దిల్‌రాజును వైస్ చైర్మన్‌గా నియమించింది.

రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ, దర్శకులు రాఘవేంద్రరావు, హరీశ్ శంకర్, అల్లాణి శ్రీధర్, బలగం వేణు, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, సాన యాదిరెడ్డి, దర్శక నిర్మాత ఆర్.నారాయణ మూర్తి, గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, నటుడు తనికెళ్ల భరణితోపాటు ఎఫ్‌డీసీ ఎండీ (మెంబర్ కన్వీనర్)తో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇదేనా మహిళల కిచ్చే గుర్తింపు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

గతంలో సముచిత స్థానం 

గత ప్రభుత్వాలు నంది అవార్డుల కమిటీల్లో మహిళలకు సముచిత న్యాయం చేశాయని, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొంటున్న రేవంత్ సర్కారు గద్దర్ అవార్డుల కమిటీ నియామకంలో మహిళలకు అన్యాయం చేసిందన్న విమర్శలు వినవస్తున్నాయి. గత అవార్డుల కమిటీలను పరిశీలిస్తే.. ఘట్టమనేని మంజుల (నటి, నిర్మాత), రోజారమణి (నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్), సుమ కనకాల (యాంకర్, నటి), దీపికరెడ్డి (కూచిపూడి నృత్యకారిణి), మంగ రెడ్డి (డిజైనర్), ఎంకేఆర్. ఆశాలత (వ్యాఖ్యాత), బాలభద్రపత్రుని రమణి, శైలేంద్ర కుమారి దువ్వూరి, రాధిక, బి.సుశీల, స్వాతి సోమనాథ్, ఐనంపూడి శ్రీలక్ష్మి, పద్మావతి వంటివారు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత కమిటీలో గద్దర్ కూతురు వెన్నెల తప్ప మరో మహిళకు స్థానం కల్పించకపోవటంపై ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.