- ఏకగ్రీవంగా ఎన్నుకొన్న ఆప్ ఎమ్మెల్యేలు
- సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా
- ఎల్జీని కలిసి రాజీనామా లేఖ సమర్పణ
- ఢిల్లీకి కేజ్రీవాలే అసలైన ముఖ్యమంత్రి
- సీఎంగా ఎంపికైన ఆతిశీ తొలి స్పందన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ప్రభుత్వ క్యాబినెట్‌లో ఏకైన మహిళా మంత్రి ఆతిశీ మర్లీనా సింగ్ ఎంపికయ్యారు. మంగళవారం ఢిల్లీలో సమావేశమైన ఆప్ ఎమ్మెల్యేలు అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఆమెను తమ నాయకురాలిగా ఎన్నుకొన్నారు. మూడు దఫాలుగా సీఎంగా కొనసాగిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తన రాజీనామా లేఖను సమర్పించారు.
ఈ వారంలోపు ఆతిశీ సీఎంగా ప్రమాణం చేస్తారి, ఈ నెల 26 తేదీలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బలం నిరూపించుకొంటారని ఆప్ వర్గాలు తెలిపాయి. లిక్కర్ పాలసీ కుంభకోణంలో గత వారమే బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్.. సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు ఈ నెల 15న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాను నిర్దోషిగా బయటపడేవరకు పదవులేవీ చేపట్టబోనని ఆయన తెలిపారు.
ఎవరినైనా అదరగొట్టగల ఆతిశీ
ఆప్ అగ్రనాయత్వంలో ఆతిశీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, జల, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి 14 శాఖలను ఆమె నిర్వహిస్తున్నారు. పార్టీకి పెద్ద దిక్కు అయిన కేజ్రీవాల్, మాజీ డిఫ్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైలుకెళ్లిన సమయంలో పార్టీని ఆమె ఒంటిచేత్తో నడిపించి నిలబెట్టారు. ఆతిశీ ప్రెస్ మీట్ పెడుతున్నారంటేనే ప్రతిపక్ష పార్టీ నేతలు మైకులు సర్దుకొంటారు. ఆమె తన వాగ్ధాటితో ఎవరినైనా నిలువరించగలరని ఇప్పటికే నిరూపణ అయ్యింది.
ఆక్స్‌ఫర్డ్ విద్యార్థి
ఆతిశీ సింగ్ 1981 జూన్ 8న ఢిల్లీలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు త్రిప్తి, విజయ్‌సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు. వామపక్ష భావజాలం కలిగిన వారు.. కార్ల్ మార్క్స్, లెనిన్ పేర్లలోని కొన్ని పదాలను తీసుకొని మార్లీనా అని ఆమె పేరు మధ్యలో చేర్చారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ స్కూల్లో పూర్తిచేశారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్రలో గ్రాడ్యుయేషన్ చదివారు. ఆమె 2003లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చరిత్రలో మాస్టర్స్ పూర్తిచేశారు. 2005లో రోడ్స్ స్కాలర్‌షిప్ సాధించారు. ఆమె భర్త ప్రవీణ్‌సింగ్. ఆయన ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి.
వివాహం అయిన తర్వాత మధ్యప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో వీరు దాదాపు 7 సంవత్సరాలు నివసించి వ్యవసాయం చేసుకొంటూ.. స్థానికులకు విద్యను బోధించారు. ఆ తర్వాత ఆతిశీ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ మ్యానిఫెస్టో కమిటీలో ఆమె కీలకంగా వ్యవహరించారు. అనతికాలంలో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. మాజీ డిఫ్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సలహాదారుగా కొనసాగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్ల తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై పోటీచేసి ఓడిపోయారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
మూడో మహిళా సీఎం
ఢిల్లీకి ఆతిశీ మూడో మహిళా సీఎం కాబోతున్నారు. గతంలో బీజేపీ తరఫున ఢిల్లీ సీఎంగా సుస్మాస్వరాజ్ పనిచేశారు. కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్ సీఎంగా సేవలందించారు. ఢిల్లీకే కాదు.. దేశంలోనే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత షీలాదీక్షిత్‌కు దక్కింది. ఆమె 1998 నుంచి 2013 వరకు సీఎంగా ఉన్నారు. సీఎం పదవి చేపట్టే నాటికి ఆమె వయసు 60 ఏండ్లు. సుస్మా స్వరాజ్ 1998లో 52 రోజులు మాత్రమే సీఎంగా కొనసాగారు. అప్పుడు ఆమె వయసు 46 ఏండ్లు. మూడో మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆతిశీ వయసు ప్రస్తుతం 43 సంవత్సరాలే.
ఆతిషీ డమ్మీ సీఎం: స్వాతి మలివాల్
ఆతిశీని తదుపరి సీఎంగా ఎన్నకోవటంపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ విమర్శలు గుప్పించారు. అతిశీ డమ్మీ సీఎం అవుతారని ఆరోపించారు. ఇక ఢిల్లీని దేవుడే కాపాడాలని ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. ఉగ్రవాది అఫ్జల్ గురును రక్షించేందుకు ఆతిశీ తల్లిదండ్రులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టారని చెప్తూ.. ఆ పిటిషన్ కాపీని షేర్ చేశారు. కాగా, పార్టీలో ఉంటే సొంత పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేయటం ఎలాంటి నీతి అని స్వాతి మలివాల్‌ను ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే ప్రశ్నించారు. ఆమెకు ఏ కోశాన అయినా ఆత్మాభిమానం, నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.
కేజ్రీవాలే నా గురువు: ఆతిశీ
సీఎం పదవికి తనను ఎంపిక చేసినందుకు పార్టీ పెద్దలకు ఆతిశీ కృతజ్ఞతలు తెలిపారు. ‘అరవింద్ కేజ్రీవాల్ నాపై నమ్మకం ఉంచారు. ఆప్ నాపై నమ్మకం ఉంచింది. అందుకే నాకు ఈ అవకాశం వచ్చింది. సీఎం అభ్యర్థిగా ఎన్నుకొన్నందుకు సంతోషంగానే ఉన్నా.. కేజ్రీవాల్ సీఎం పద వి నుంచి దిగిపోయినందుకు బాధ గా ఉన్నది. ఢిల్లీకి ఒకేఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ ఒక్కరు కేజ్రీవా ల్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించటమే మనందరి లక్ష్యం. సీఎంగా ఆప్, ఢిల్లీ ప్రయోజనాలు కా పాడుతా. ఢిల్లీ ప్రజలకు ఒక విజ్ఞప్తి.. వచ్చే ఎన్నికల్లో కూడా మీ కుమారు డు, సోదరుడిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయండి’ అని పిలుపునిచ్చారు.