calender_icon.png 22 September, 2024 | 3:07 PM

వంద నియోజకవర్గాల్లో ఏటీసీలు

22-09-2024 12:46:16 AM

  1. సిలబస్ రూపకల్పనకు నిపుణుల కమిటీ  
  2. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు
  3. స్కిల్ వర్సిటీ పరిధిలోకి ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు
  4. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి):  హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని సూచించారు. ఆయా కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు ఓ కమిటీని నియమించి, నిపుణులు, విద్యావేత్తల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. సచివాలయంలో  కా ర్మిక, ఉపాధి కల్పనాశాఖ అధికారులతో శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించా రు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ర్టం లో ఐటీఐ/ ఏటీసీలు లేని నియోజకవర్గాల ను గుర్తించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రతి ఐటీఐ కాలేజీకి ప్రిన్సిపాల్ ఉండేలా చూడాలని సూచించారు. ఐటీఐల పర్యవేక్షణ, తనిఖీలు క్రమం తప్పకుండా చేపట్టాల ని ఆదేశించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ కొత్త ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్)లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల ని సూచించారు. ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డి  పాల్గొన్నారు.