calender_icon.png 8 January, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధనుర్మాస వేళలో!

20-12-2024 12:00:00 AM

ఏడాదిలో లక్ష్మీనారాయణుల కోసం ప్రత్యేకించి కొలిచే కాలం ‘ధనుర్మాసం’. మార్గశీర్ష బహుళం నుంచి పుష్య బహుళం వరకు నెల రోజులూ సూర్య గమనం ధనుస్సు రాశిలో సాగుతుంది కనుక, దీనికి ఆ పేరు వచ్చినట్టు పండితులు చెప్తారు. ఇంకా, ఈ నెల ప్రత్యేకత ఏమిటంటే, దక్షిణాయనానికి ముగింపు, ఉత్తరాయనానికి ప్రారంభం కూడా. ఈ నెల 16న మొదలైన ధనుర్మాసం వచ్చే నెల (కొత్త సంవత్సరం) 13న పౌర్ణిమతో ముగుస్తుంది.

భూదేవి అవతారమైన ఆండా ళ్ గోదాదేవిగా జన్మించి భగవంతుడినే భర్తగా భావించి, ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతాన్నే ‘తిరుప్పావై’గా పిలుస్తున్నారు. ‘తిరు’ అంటే ‘శ్రీ’ (లక్ష్మిదేవి), ‘పావై’ అంటే ‘పాటలు’ లేదా ‘వ్రతం’ అని అర్థం. తిరుప్పావైలో 30 పాశురాలు ఉంటాయి. ‘పాశురం’ అంటే ‘ఛందోబద్ధమైన భక్తి గేయం.

ఆండాళ్ అపురూప పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు తన ‘ఆముక్త మాల్యద’ అనే గ్రం థంలో ఎంతో గొప్పగా వివరించారు. గోదాదేవి రచించిన 30 పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సహాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించాలని ప్రబోధిస్తాయి. ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు గానం చేయడం ఆనవాయితీ.

సుప్రభాతం స్థానంలో తిరుప్పావై 

శ్రీమహావిష్ణువుకు, మహాలక్ష్మిదేవికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల ముఖ్యంగా వైష్ణవులు ఈనెల రోజులూ ‘ధనుర్మాస వ్రతం’ ఆచరిస్తారు. ఈ సందర్భంగా గోదాదేవి వృత్తాంతం అత్యంత ప్రాచుర్యం పొందింది. శ్రీవైష్ణవ ఆళ్వారులలో ఏకైక స్త్రీమూర్తిగా ఆమె చరిత్ర ప్రసిద్ధినొందారు. గోదాదేవినే ‘ఆండాళ్’ అనీ అంటారు. ఆమె ధనుర్మాసమంతా విష్ణుపూజా వ్రతం చేపట్టి ఆఖరకు రంగనాథుని రూపంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుణ్నే భర్తగా పొందింది. ఇదే ‘గోదా కళ్యాణం’గా ప్రసిద్ధి.

ఈ నెల పొడుగునా సూర్యాలయాలు, వైష్ణవాలయాలను సందర్శించడం భక్తులకు ఎంతో పుణ్యప్రదమని వేద పండితులు చెప్తారు. ఇంకా దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణాలు, ప్రసాదాల వితరణలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ఈ నెలరోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్ర నామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. తిరుమలలో అయితే, ఈ నెల రోజులు సాంప్రదాయ సుప్రభాతం స్థానంలో ‘తిరుప్పావై’ గానం చేయడం విశేషం.

ముఖ్యంగా ధనుర్మాసం పొడుగునా పెళ్లికాని అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లు దిద్దుతారు. సంక్రాంతికి ముందు వచ్చే ఈ నెల రోజులూ ఈ వేడుక వెల్లివిరుస్తుంది. దీనివల్ల కోరిన వరుడు లభిస్తాడని వారు నమ్ముతారు. గోదాదేవి ఆచరించిన వ్రతాన్ని ‘మార్గళి’ అనీ అంటారు. ఆమె ఈ నోము పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది కనుక, శ్రీకృష్ణుడికి నెల రోజులూ తులసీమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహమవుతుందన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. 

ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లోనే కాక భాగవతంలో, నారాయణ సంహితలోనూ ఉన్నట్టు వేద పండితులు వివరించారు. మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ నోము విశేషాలు బోధించినట్లు పురాణ కథ నం ఉంది. ఈ కాలమంతా ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం లక్ష్మీదేవికి కనీసం దీపారాధన చేసినా చాలు, ఆమె అనుగ్రహించి దారిద్య్రాన్ని తొలగిస్తుందనీ అంటారు.

ఈ వ్రతం ఆచరించాలనుకునే యువతులు, మహిళలు, ఇతర భక్తులు రోజూ సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి. లక్ష్మీనారాయణుల శోడషోపచారాలు, అష్టోత్తర సహస్రనామాలతో పూజించాలి. నెలరోజులూ చేయలేని వాళ్లు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చనని పెద్ద లు చెబుతున్నారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించే అద్భుత వ్రతంగానూ ‘ధనుర్మాస’ నోమును వారు చెప్తారు.