- ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు ౩,5౦౦ మొదటి విడతలో 4.5 లక్షల గృహాలు
- ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కు
- 200 కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలిస్తాం
- కాళేశ్వరంతో ఎకరం కూడా తడువలేదు
- 7 నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేశాం
- మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, సీతక్క
- భూపాలపల్లి జిల్లాలో పారిశ్రామిక పార్కు శంకుస్థాపన
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఈ నెలాఖరులోగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. మొదటి విడతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ౩,౫౦౦ ఇండ్లు నిర్మిస్తామని వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 1.50 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు మాత్రమే ఇచ్చిందని, ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇల్లు అని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేశారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను వీలైనంత త్వరగా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు కట్టించి ఇస్తుందని ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం మైలారం వద్ద ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్‌కు మంత్రి సీతక్క తో కలిసి శ్రీధర్‌బాబు, పొంగులేటి శనివారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు కండ్లు అని అన్నారు.
పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతుభరోసా, పంటకు బీమా, విత్తనాల సబ్సిడీ ఇస్తూ రైతులను రాజుగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. శాసనసభ్యులు కోరిన విధంగా భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టా లు ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినా ధరణి గురిం చి పచ్చి అబద్ధాలు చెప్తూనే ఉన్నారని విమర్శించారు. ధరణి పోర్టలే వాళ్ల కొంప ముంచిందని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు కూడా ఎత్తలేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి కేంద్రం తొండాట ఆడుతుందని ఆరోపించారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని వైద్యులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.3.60 కోట్ల వ్యయం తో నిర్మించిన ఔషధాలు భద్రపర్చే గోదాం, రూ.27 లక్షలతో నిర్మించిన వైద్యాధికారుల క్యాంటీన్‌ను పొంగులేటి సీతక్కతో కలిసి ఆయ న ప్రారంభించారు. ప్రభుత్వ దవాఖానకు పేదలే ఎక్కువగా వస్తారని, అలాంటి వారికి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రధాన దవాఖాన అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వైద్యసేవల కోసం ఇక్కడి ప్రజలు వరం గల్, హైదరాబాద్‌లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే పూర్థిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
ఇండస్ట్రియల్ పార్క్‌తో ఉద్యోగావకాశాలు: సీతక్క
భూపాలపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో వేలమందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి సీతక్క తెలిపారు. గత పదేళ్లుగా ఉద్యోగాలు లేక ఉపాధి కోసం అనేక మంది పట్టణాలకు వలస వెళ్తున్నారని, అలాంటి పరిస్థితులు ఇకపై ఉండవని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లోని యువత భవిష్యత్‌కు మార్గం ఏర్పడిందని, మంత్రి చొరవతోనే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటవుతున్నదని చెప్పారు. ములుగులో సైతం పార్క్ ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని, స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, భూపాలపల్లి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్‌రెడ్డి, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో పాటు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరంతో ఒక్క ఎకరా తడవలేదు
లక్ష ఎకరాలకు సాగునీరు పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భూపాలపల్లి ప్రాంతంలో ఒక్క ఎకరానికీ సాగునీరు అందించలేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. రెండు ప్రాజెక్టులు ఉన్నా రైతులకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మంథని, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని ఒక్క ఎకరాకు అయి నా సాగునీరు అందించారా? అని ప్రశ్నించారు. అశాస్త్రీయంగా ప్రాజెక్టులు నిర్మిం చటం వల్లనే కూలిపోతున్నాయని విమర్శించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామని, రెండు విడతల్లో రుణమాఫీ చేసి రైతుల ఖాతాల్లో రూ.౧౨ వేల కోట్లు జమ చేశామని వివరించారు.
ఈ ప్రాంత ంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పార్కుల ద్వారా 200 పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ములుగు, భూపాలపల్లి సాగునీటి అవసరాలు తీరుస్తామన్నారు. త్వరలో నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి డీపీఆర్ తయారు చేస్తామని వివరించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని, న్యాయపరంగా వ్యవహరించాలని అటవీశాఖ అధికారులు, పోలీ సులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారు లతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాళా తీయించిందని ఆరోపించా రు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.