బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనాను మానవతా దృక్పథంతోనే భారత్ లోకి అనుమతించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. బంగ్లా పరిణామాలపై మంగళవారం పార్లమెంట్‌లో జైశంకర్ వివరణ ఇచ్చారు. ఆదివారం ఘర్షణలతో బంగ్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని, అదే రోజు కర్ఫ్యూ విధించినా పరిస్థితులు మారలేదన్నారు. ఆ సమయంలో ఆర్మీ రంగంలోకి దిగి ప్రధాని రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా హసీనా భారత్‌కు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారని, చాలా తక్కువ సమయంలో ఈ అభ్యర్థన చేశారని వివరించారు. అందుకే మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష భేటీలో మరిన్ని వివరాలను జైశంకర్ వెల్లడించారు.
పొరుగుదేశంలో శాంతిభద్రతలు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని, అక్కడి భారతీయులను తరలించాల్సినంత ప్రమాదకర పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. మన దేశ పౌరుల భద్రత విషయంలో బంగ్లా ఆర్మీతో టచ్‌లో ఉన్నామని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు.
బంగ్లాలో దాదాపు 19 వేల వరకు భారతీయులు ఉన్నారని, ఇందులో 9 వేల మంది విద్యార్థులని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ పలు ప్రశ్నలు వేశారు. హసీనా రాజీనామా డిమాండ్ వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అని ప్రశ్నించారు.
దీనిపై ఇప్పుడే ఎలాంటి అంచనాకు రాలేమని, కానీ ఓ పాకిస్థాన్ దౌత్యవేత్త ఆందోళనలకు మద్దతుగా తన ప్రొఫైల్ పిక్‌ను మార్చుకున్నారని సమాధాన మిచ్చారు. కాగా, బంగ్లా పరిణామాలపై జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాలో మైనారిటీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.