20-04-2025 12:58:00 AM
గద్వాల్/ నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): భూభారతి-2025 చట్టం రైతులకు భద్రతను కల్పిస్తుందని, ప్రతీ రైతుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులమంతా కలిసి ఈ చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నా రు.
భూభారతి చట్టంపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు, గద్వాల జిల్లా ధరూర్ మండలకేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ధరణి వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో రైతులకు తెలుసునని, దాన్ని దృష్టిలో పెట్టుకొని భూభారతి చట్టానికి రూపకల్పన చేసిన ట్టు చెప్పారు.
రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ, భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. సాదాబైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని, పేర్లు, సర్వే నెంబర్లు, విస్తీర్ణంలో తప్పుగా నమోదైనా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పరిష్కారం లభి స్తుందన్నారు.
ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారా తమ భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. మే 1 నుంచి ప్రతి రెవి న్యూ గ్రామానికి అధికారులు వెళ్లి, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పా రు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ, అటవీ, ప్రైవేట్ భూములకు గుర్తింపు లభిస్తోందని చెప్పారు. అధికారులు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించరాదని మంత్రి హెచ్చరించారు.
నలుగురు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నాలుగు గోడల మధ్య ధరణి పోర్టల్‌ను రూపొందించి, రైతులను ఇబ్బందులు పెట్టారని ఆక్షేపించారు. పదేళ్ల పాటు రాష్ట్రంలోని రైతాంగం భూ సమస్యలతో బాధపడ్డారని, అందు కు కారణమైన ధరణిని బం గాళాఖాతంలో విసిరేస్తామని హామీ ఇచ్చామని, దాన్ని నెరవేర్చామని చెప్పారు.
ఈ పోర్టల్ ద్వారా రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించుకొనేలా గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారిని నియమి స్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డు మాదిరి భూ యజమానులకు భూధార్ కార్డులను మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులను ఇబ్బం దులు పెట్టే రెవిన్యూ అధికారులను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు.
గద్దొచ్చి కోడిపిల్లని తన్నుకుపోయినట్టు ధరణితో గత ప్రభుత్వం భూములను కాజేసిందనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తే కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.
నూతన తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటుకు మంత్రి సహక రించాలని ఎంపీ మల్లు రవి కోరారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న రైతు భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు.
గద్వాలలో ప్రొటోకాల్ రగడ
భూభారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర రెవిన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గద్వాలలో పర్యటించగా, స్థానికంగా నిర్వహించిన సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గీయుల మధ్య ప్రోటోకాల్ రగడ రాజుకుంది.
బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆయన యూటర్న్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత.. బండ్ల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాల పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
ఈ పంచాదీ గాంధీభవన్‌కూ చేరిన విషయం తెలిసిందే. బండ్లను కాంగ్రెస్‌లో తీసుకొచ్చేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా కృషి చేస్తున్నారన్న అనుమానంతో గతంలో గద్వాలలో పర్యటించిన మంత్రి జూపల్లిని సైతం సరిత వర్గీయులు రెండుసార్లు అడ్డుకున్నారు. తాజాగా మంత్రి పొంగులేటి పర్యటనలోనూ బండ్ల, సరిత వర్గీయుల మధ్య ప్రోటోకాల్ రగడ రాజుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పొలీసులు సమస్యను సద్దుమనిగించారు.
ల్యాండింగ్ సమయంలో చెలరేగిన మంటలు
భూభారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మల్లురవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్‌కు నాగర్‌కర్నూల్‌లో పెనుప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌లో ల్యాండింగ్ సమయంలో సిగ్నల్స్ కోసం వదిలిన బుల్లెట్ ఫైర్ వల్ల హెలిప్యాడ్ వద్ద ఉన్న ప్రదేశంలో ఎండు గడ్డి అంటుకొని మంటలు చెలరేగాయి. హెలికాప్టర్ ల్యాండింగ్ కాకముందే మంటలు అదుపు చేసేందుకు స్థానిక పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అక్కడే ఉన్న నల్లా నీటితో మంటల్ని ఆర్పడంతో ప్రమాదం తప్పింది.