calender_icon.png 13 February, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధులకు భరోసా

13-02-2025 12:00:00 AM

కొడుకుల, బిడ్డల నిరాదరణకు గురవుతున్న వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం 2007లో ‘తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ’ సంరక్షణ చట్టాన్ని తెచ్చింది. ప్రతి డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, హక్కుల రక్షణ కోసం నియమావళిని రూపొందించింది. కమిటీకి ఛైర్మెన్‌గా రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి వ్యవహరిస్తారు.

జిల్లా వికలాంగుల సహాయ సంచాలకులు ‘వయోవృద్ధులు శాఖ సహాయ సంచాలకులు కన్వీనర్లుగా’ స్వచ్ఛంద సంస్థలనుంచి ఒకరు లేదా ఇద్దరు ప్రతినిధులు వుంటారు. ఈ కమిటీకి కోర్టుకు వుండే అధికారాలు వుంటా యి. కమిటీ తల్లిదండ్రుల కేసులు విచారించి 90 రోజుల్లో  తీర్పులు ఇస్తాయి. కాని, క్షేత్రస్థాయిలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ఆశించిన విధంగా జరగడం లేదు. 

రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి తన రెగ్యులర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల సమయం చాలడం లేదు. దీంతో వయోవృద్ధుల సమస్యలు పరిష్కారానికి నోచుకోని స్థితి ఏర్పడింది. రాష్ట్రంలో వృద్ధులను బెదిరించి వారి ఆస్తులను తమ పేరుమీద రాయించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గ్రామీణ ప్రాంతాలలోని ఒంటరి వృద్ధులు ఆస్తులు కోల్పోయి బజారున పడడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వృద్ధాప్య పింఛన్లు, ఒంటరి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు పథకాలు ప్రవేశపెట్టడం అభినందనీయం. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్షరాస్యులైన వయోవృద్ధుల సంక్షేమం వారి హక్కుల రక్షణకు సమగ్రమైన చర్యలు చేపట్టాలి. కేంద్రం వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 14567 గురించి విస్తృత ప్రచారం జరగాలి.

ప్రభుత్వాల ఆధ్వర్యంలో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. ఉచిత న్యాయ చైతన్య సదస్సులు జరపాలి. భూమి  యాజమాన్యం, హక్కులు, పేరు మార్పిడి, వీలునామా సంరక్షణ చట్టాల గురించి సీనియర్ సిటిజన్స్‌కు విస్తృత అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. వారు ఎదుర్కొనే సమస్యలను జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికార్లకు నివేదించాలి. వృద్ధులను మానవ వనరుల అభివృద్ధికి సారథులుగా సమాజం, ప్రభుత్వం గుర్తెరగడం అవసరం.

 నేదునూరి కనకయ్య