ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. అగ్రరాజ్యమైన అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు, భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
గురువారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందిస్తూ.. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో చెప్పాలన్నారు. ఇలాంటి దగాకోరుకు తెలంగాణలో పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని, సీఎం రేవంత్ అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే కుట్రలో బడే భాయ్, అదానీ భాయ్, హైకమాండ్ వాటా ఎంతో చెప్పాలన్నారు.