calender_icon.png 16 November, 2024 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుశిష్యుల అనుబంధం

06-07-2024 12:05:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

గురుశిష్యుల మధ్య ఉండే అవినాభావ సంబంధం అద్వితీయం. మనం ముందు మంచి శిష్యులమైతే తర్వాత మంచి గురువులమవుతాం. మనకు మంచి గురువు లభించాడంటే తాను ముందు ఎంత మంచి విద్యార్థిగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. అటువంటి గురువులే శిష్యుల మనసుల్ని అర్థం చేసుకోగలరు.

వ్యాసుని వంటి గురువు, వినాయకుని వంటి శిష్యులు ఉన్నంత కాలం లోకంలో ‘గురు శిష్యుల అనుబంధం’ చిరస్థాయిగా ఉంటుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, గురుశిష్యుల మధ్య బంధం తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్ల వంటిది. అయితే, వీటిని నిలుపుకొనే వారు ఈ కాలంలో ఎందరు? ఆధునిక కాలంలో గురువులకు పూర్తి విలువ ఇచ్చే శిష్యులు, శిష్యులపట్ల బేషరతు వాత్సల్యాన్ని కనబరిచే గురువులు చాలా అరుదు. ఈ పరిస్థితుల్లో ‘రామలింగం సార్’ వంటి గురువును నేనింత వరకు చూడలేదు. 

కొందరు గురుశిష్యుల మధ్య ఉండే అవినాభావ సంబంధం అద్వితీయం. మనం ముందు మంచి శిష్యులమైతే తర్వాత మంచి గురువులమవుతాం. మనకు మంచి గురువు లభించాడంటే తాను ముందు ఎంత మంచి విద్యార్థిగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. అటువంటి గురువులే శిష్యుల మనసుల్ని అర్థం చేసుకోగలరు. అవి నేను ఉన్నత పాఠశాలలో చదివే రోజులు. రామలింగం సార్ వంటి గొప్ప గురువు లభించడం నా అదృష్టమేనేమో. మా మధ్య ఆనాడు జరిగిన ఆ సంఘటన ఎంత కాకతాళీయమే అయినా, గురు శిష్యుల నడుమ ఉండవలసిన అనుబంధాన్ని అద్వితీయంగా చాటిచెప్పింది.

చింతపల్లి హైస్కూల్‌లో రామలింగం సార్ మాకు హిందీ చెప్పేవారు. ఆయన క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యమిస్తారో గురుశిష్యుల మధ్య ఉండాల్సిన బంధానికీ అంతే విలువ ఇస్తారని నాకు ఆ తర్వాత కాని అర్థం కాలేదు. వారికి ఎంతో మంచి ఉపాధ్యాయునిగా పేరుంది. కష్టపడి చదువుకున్న వారు. వాళ్ల అమ్మ బజార్లో బజ్జీలు అమ్మి రామలింగం గారిని చదివించినట్లు విన్నాను. నేను ఎప్పుడైనా బజ్జీలు తింటే రామలింగం గారే గుర్తుకు వచ్చేవారు.

వారెప్పుడూ క్లాసుకు ఆలస్యంగా వచ్చేవారు కాదు. రెండు, మూడు నిమిషాలు ముందుగానే వచ్చి బయట నిలబడేవారు. లోపల అంతకు ముందు, పాఠం చెప్పే మాస్టారు బయటికి వెళ్లేవరకూ ఆగి, ఆ తర్వాతే లోపలికి వచ్చేవారు. రామలింగం సారంటే మా పిల్లలందరికీ చాలా గౌరవం. నాకు మొదటినుంచి చదువుపట్ల మంచి శ్రద్ధ ఉండేది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో ఉండేవాణ్ణి. అందుకే, క్లాసులు ఎగ్గొట్టడమనేది నాకు తెలియదు. రిజిష్టర్‌లో నా అటెండెన్స్ నూటికి నూరు శాతం ఉండేది. చిన్నతనంలో ఆ విధంగా ప్రవర్తించిన వాణ్ణి కనుకనే, అనంతర కాలం లో నేను చేపట్టిన నలభై ఏళ్ల బోధనా వృత్తి లో ‘సెలవు తీసుకోవడం’ అన్నది చాలా అరుదు అనే చెప్పాలి.

‘హిందీ సార్’ క్లాస్ కోసం..

ఆ రోజు పాఠం చెప్పిన నరసింహారెడ్డి సారు క్లాసునుంచి అప్పుడే నిష్క్రమించారు. ఆ తర్వాతి క్లాసు రామలింగం సార్‌ది. నరసింహారెడ్డి సార్ బయాలజీ చెప్పేవారు. వారి క్లాసు చమత్కారాలతో, లోకానుభవంతో సాగేది. పిల్లలమందరం వారి క్లాసం టే చెవులు కోసుకునేవారు. ఆ సంతోషం లో మునిగి ఉండగా, నా పక్కన కూర్చు న్న మిత్రుడు “హిందీ సారింకా రాలేదు” అని నా చెవిలో చెప్పాడు. తరగతి గదిలో స్టూ డెంట్స్ అంతా రామలింగం సార్ కోసం చూస్తున్నారు. కొద్ది నిముషాలు గడిచాయి. అయినా, సార్ రాలేదు. నాకు ఆశ్చర్యమేసింది. అందరి స్టూడెంట్స్‌లా నేను ఊరు కుంటే పోయేది. కానీ, విరుద్ధంగా ప్రవర్తించాను. అది ఒక రకంగా నా తప్పే కావచ్చు. అయినా, ఆ వయసులో నాకు తప్పనిపించలేదు. 

వెంటనే లేచి స్టాఫ్‌రూమ్ దగ్గరకు వచ్చా ను. లోనికి తొంగి చూశాను. సార్లంతా ఏదో విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. రామలింగం సార్ కూడా వారిలో ఉన్నారు. ‘సార్ క్లాసు విషయం మరిచిపోయినట్లున్నారు!’ అనుకొన్నాను. లోనికి వెళ్లి పిలవాలా, వద్దా? అని నేను కొద్దిసేపు మీమాంస పడ్డాను. ఏదైతే అది అయిందని లోనికి అడుగు వేశాను. అందరు ఉపాధ్యాయులూ నాకేసి చూశారు. నేను రామలింగం సార్ వైపు చూస్తూ అన్నాను, “సార్, మీ క్లాసు సమయమైంది..”. స్టాఫ్‌రూమ్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. సార్లంతా రామలింగం సార్‌కేసి చూశారు. ఆయన నాకేసి చూశారు. నాకేం భయమనిపించలేదు. కానీ, రామ లింగం సార్ ముఖం సీరియస్‌గా కనిపించడంతో నేను వెంటనే వెనుతి రిగాను. మౌ నంగా క్లాసులోకి వెళ్లిపోదామనుకున్నాను. కానీ, ఉన్నట్టుండి సార్ గొంతు వినిపించింది. నన్ను తన దగ్గరకు రమ్మని పిలిచారు. 

నేను చాలా మామూలుగానే వెళ్లాను. ఉపాధ్యాయులంతా మమ్మల్నే చూస్తున్నా రు. ‘రామలింగం సారు ఏమంటాడో’ అని చూసే అంతలోనే నా తలను వంచి వీపుమీద ఒక గుద్దు గుద్దాడు. దెబ్బ బలంగానే తగిలినట్టుంది, వీపంతా నొప్పి పెట్టింది. నా రెండు చేతులూ వెనక్కి విరిచి వీపుపై రుద్దుకున్నాను. ఈ హఠాత్ పరిణామానికి నాకు ఏడుపు వచ్చింది. కానీ, ఏడవలేదు. ముఖం పాలిపోయినట్టు నాకు తెలుస్తూనే ఉంది. రామలింగం సార్ నిజానికి ఎవరినీ తిట్టేవారు కారు. కొట్టడం అసలు లేదు. మరి, ఎందుకని నన్ను కొట్టారు? బహుశా అంద రి ముందు వారితో ‘మీ క్లాసు ఉంది సార్’ అని చెప్పినందుకు వారేమైనా అవమానంగా భావించవచ్చు. లేదా వారేదో చర్చ లో ఉన్నప్పుడు మధ్యలో నేను దూర డం కారణం కావచ్చు. ఏదైతేనేం వారు కొట్టిన దెబ్బ చిరస్మరణీయం. ఎవరైనా తమకు బాధ కలిగినప్పుడే ఇట్లా వ్యవహరిస్తారేమో అన్న విషయాన్ని కూడా ఆలోచించే వయ స్సు నాది కాదు. నా పరిస్థితిని సార్లెవరూ పట్టించుకోలేదు. రామలింగం సార్ వెంటనే, “వస్తున్నాను పద క్లాసుకు” అని నన్ను డోరువైపు తోశారు. నేను మౌనంగా క్లాసుకు వచ్చేశాను.

వారు క్లాసు తీసుకున్నంత సేపు నేను క్లాసులోనే ఉన్నాను. కానీ, వారి పాఠం నా మనస్సుకే మాత్రం ఎక్కలేదనేది నిజం. అంతమంది మాస్టార్ల ముందు రామలింగం సారు నన్ను కొట్టడమేమిటి? అసలు నేనేం తప్పు చేశాను? క్లాసుకు వేళయిందని చెప్పడం తప్పా? సార్ మీద కోపం వచ్చింది. అయినా, నేనేం చేయగలను? 

అప్పుడు నేను.. నేను కాను!

ఇంతవరకు జరిగింది ఒక ఎత్తయితే, ఆ తర్వాత జరిగింది మరో ఎత్తు. నేను కలలోనైనా ఊహించని పరిణామం అది. సార్ క్లాసైంది. సాధారణంగా రామలింగం సార్ క్లాసులో ప్రవేశించినప్పుడు గాని, నిష్క్రమించినప్పుడు గాని విద్యార్థులందరూ లేచి నిలబడడం సంప్రదాయం. అప్పుడు కూడా సార్ క్లాసు ముగించి బయటికి వెళ్లడానికి సిద్ధం కాగానే, క్లాసులోని పిల్లలంతా యథావిధిగా లేచి నిలబడి, ధన్యవాదాలు చెప్పా రు. కానీ, ఆశ్చర్యంగా ముందు బెంచీలో కూర్చున్న నేను లేవ లేదు. అలానే నేల చూపులు చూస్తూ కూర్చుండిపోయాను. తర్వాత నాకే అర్థం కాలేదు, నేను ఎందుకలా చేశానో! 

నా వాలకాన్ని గమనించిన రామలింగం సార్ క్లాస్ బయటికి వెళ్లాక ఉన్నట్టుండి వెనక్కి వచ్చి, నా పేరు పెట్టి పిలిచారు. నన్ను బయటికి రమ్మన్నారు. సోపతోళ్లంతా నా వైపే చూశారు. నేను లేచి నిలబడనందుకు సార్ తిడతారని అనుకున్నారంతా. కానీ, స్టాఫ్‌రూమ్‌లో సార్ నన్ను కొట్టిన సంగతి వారికెవరికీ తెలియదు. ఆయన నా భుజం మీద చేయి వేసి, క్లాసురూమ్ బయట ఉన్న ఒక చెట్టువద్దకు తీసికెళ్లారు. ‘నాతో ఏం మాట్లాడతారో అని భయంభయంగానే ఉన్నా, ‘నేను తప్పు చేయలేదు, అయినా, నన్నెందుకు ఆయన కొట్టారు?’ అన్నదే నా ఆలోచన. 

గాయపడిన మాస్టారు మనసు!

రామలింగం సార్ నేను ఊహించని విధంగా, నా గదువ కింద చెయ్యి పెట్టి తల పైకెత్తించి తనకేసి తిప్పుకొని అన్నారు “సారీ చెన్నప్పా! నిన్ను అనవసరంగా కొట్టాను!!” నా మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘సారేమిటి, నాకు సారీ చెప్పడమేమిటి?!’

“నువ్వేమీ బాధపడకు. నేనెందుకు కొట్టా నో నాకే తెలియదు. రెగ్యులర్‌గా క్లాసు తీసుకునే నాకు క్లాసుందని గుర్తు చేయడం నీ బాధ్యత. స్టూడెంట్‌గా నువ్వు చేసిన తప్పేమీ లేదు. కాకపోతే, అందరి ముందు నాకే ఇబ్బంది అనిపించింది..” అన్నారు నన్ను అనునయిస్తూ. నేను బాధపడుతున్న సంగతి రామలింగం సార్ గుర్తించి, ఆ మేరకు శిష్యుణ్ణని కూడా చూడకుండా నాకు ‘సారీ’ చెప్పా రన్న విషయం అర్థమైంది. నాకూ సార్ చేత అలా క్షమాపణ చెప్పించుకోవడం నచ్చలేదు. “వద్దు సార్. మీరలా అనకూడదు. మీరు గురువులు!” అని మాత్రం అన్నాను. 

అంతే, ఇక తర్వాత ఎప్పుడూ రామలింగం సార్ క్లాసుకు లేటుగా రాలేదు. మా గురుశిష్యుల మధ్య ఇంత జరిగినా నేను విషయం ఎవరికీ చెప్పలేదు. ఒక గురువు అవసరమైతే విద్యార్థికి క్షమాపణ చెప్పిన ఆ సన్నివేశం నాకెందుకో చాలా ఆశ్చర్యమనిపించి, ఇప్పుడిలా బయటపెడుతున్నాను.

వ్యాసకర్త సెల్: 9885654381