calender_icon.png 27 October, 2024 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ పనిదినాలు పెంచుతాం

24-07-2024 12:43:42 AM

మా ప్రభుత్వ ఆలోచన అదే

31లోపు బడ్జెట్‌ను ఆమోదించాల్సిన అనివార్యత

లేదంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి

హరీశ్‌రావు అన్ని తెలిసీ ఆరోపణలు చేస్తున్నారు

శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): అసెంబ్లీ పనిదినాలు పెంచాలన్న దే తమ ప్రభుత్వ ఆలోచననని, కేంద్ర బడ్జెట్‌ను పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి వచ్చే నిధుల ఆధారంగా రాష్ర్ట పద్దు రూపకల్పన ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ నెల 31లోపు తప్పని సరిగా బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించాల్సి ఉందని లేదంటే ఉద్యోగుల జీతాలు ఇవ్వలేమని పేర్కొన్నారు. సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు రోజు ల్లో బడ్జెట్‌పైన పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, అన్ని తెలిసీ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తున్నారని శ్రీధర్‌బాబు ఆరోపించారు.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ఏడెనిమిది రోజులకు మించి నిర్వహించలేదని గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్‌కు రెండు నెలల ముందే రాష్ర్ట బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు తగిన సమయం ఇవ్వలేదన్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ మూడు రోజులు మాత్రమే బడ్జెట్ డిమాండ్లపై చర్చ జరిపిందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదని, తమ ప్రభుత్వం వచ్చిన ఆర్నెల్లలోనే అనేక హామీలు నెరవేర్చిందని తెలిపారు.

ఖజానాను గాడిలో పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, ప్రతిపక్షాలకు ఇంకా సమయం కావాలంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 రోజుల వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సంప్రదాయాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి అంశంపై సభలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. బడ్జెట్ డిమాండ్స్‌లో అన్ని విషయాలు మాట్లాడటానికి ప్రతిపక్షానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 

ఒకరోజు ముందే అజెండా ఖరారు 

అసెంబ్లీ సమావేశాల అజెండా ఒక రోజు ముందే ఖరారవుతుందని, పది రోజుల ముందే ఇవ్వరన్న విషయం హరీశ్‌రావుకు కూడా తెలుసునని శ్రీధర్‌బాబు అన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ అజెండాను రూపొందిస్తారని తెలిపారు. రాష్ర్టంలో శాంతిభద్రతలు లేవని హరీశ్‌రావు మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో పట్టపగలు న్యాయవాద దంపతులను నడిరోడ్డుపై హత్య చేస్తే పట్టించుకున్నవారే లేరని అన్నారు. స్థానిక సంస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసిన విషయం బీఆర్‌ఎస్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులపై బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందని, దీన్ని వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి, మంత్రులు కేంద్రాన్ని అనేకసార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కేంద్రం నుంచి దాదాపు రూ.6 వేల కోట్ల వరకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. 

నిధుల కోసం పోరాటం 

రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యం తెలంగాణకూ ఇవ్వాలన్నారు. రాష్ట్రంపై కేం ద్రం చిన్నచూపు మీద రాష్ర్ట బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. విభజన చట్టంలో అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగేంతవరకు కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. గతంలో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ప్రధాని మోదీని కలిశారని, తాము మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం భేటీ అయ్యామన్నారు. రాష్ర్టం హక్కులపై కేంద్రంలోని బీజేపీని కచ్చితంగా అడుగుతామని, తాము బీజేపీకి భయపడే ప్రసక్తే లేదన్నా రు. రాజకీయ ప్రయోజనాలను దృ ష్టిలో ఉంచుకొని కేంద్రం కొన్ని రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తే మిగిలిన రాష్ట్రాల ప్రగతి కుంటుపడు తుందని శ్రీధర్‌బాబు మండిపడ్డారు.