తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆమోదించేందుకు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు పలు నిర్మాణాత్మక నిర్ణయాలతోపాటు సభ్యుల ఆగ్రహావేశాలకు కూడా వేదికయ్యాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించటంలో సఫలమయ్యారు. ఈ విషయంలో ఆయనను అభినందించి తీరాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ చతురత, వాక్పటిమ మరోసారి సభ సాక్షిగా ఆవిస్కృతమయ్యాయి. తెలంగాణ అభివృద్ధిపై తన విజన్‌ను ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల్లో చక్కగా ఆవిష్కరించారు. అదే సమయంలో గత పదేండ్లలో తెలంగాణకు అన్ని రంగాల్లో జరిగిన నష్టాన్ని ఎత్తిచూపి ప్రతిపక్షాన్ని నియంత్రించగలిగారు.
తీవ్ర ఒత్తిడిలో ఉన్న విపక్ష బీఆర్‌ఎస్ పార్టీ అధికార పక్షాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేసింది. చాలాసార్లు విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు అలా వచ్చి ఇలా వెళ్లారు. బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజు సభకు వచ్చిన కేసీఆర్.. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగియక ముందే సభనుంచి వెళ్లిపోయారు. ఆయన సభ నడిచినన్ని రోజులు సభకు వస్తే బాగుండేది. రావటం ఇష్టంలేకపోతే ప్రతిపక్ష నేత పదవిని ఆయన కుమారుడు కేటీఆర్‌కు అయినా అప్పగించాలి.
కేటీఆర్ సభలో బడ్జెట్‌తోపాటు వివిధ చర్చల్లో పాల్గొన్నప్పటికీ ఇంకా హుందాగా వ్యవహించాల్సి ఉండే. విపక్ష సభ్యులు సభను అడ్డుకోవద్దని, వెల్‌లోకి దూసుకెళ్లవద్దని, బహిష్కరించవద్దని గతంలో సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజు నిర్ణయించి, రెండోరోజు నుంచే అవన్నీ చేసేవారు. తాజా సమావేశాల్లో కూడా అలాంటి పరిస్థితే కనిపించింది. సభను సజావుగా కొనసాగనిచ్చి, ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వివిధ బిల్లుల్లో సవరణలు ప్రతిపాదించి సాధించుకొంటే బాగుండేది. కానీ, సైబర్ సెక్యూరిటీ బిల్లు విషయంలో మాత్రమే కేటీఆర్ అలా చేయగలిగారు. ప్రజల్లో ఆదరణ పొందేందుకు వచ్చిన కొన్ని మంచి అవకాశాలను ఆయన వినియోగించుకోలేకపోయారు.
ఈసారి సమావేశాల్లో కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయాలు కూడా చర్చకు వచ్చి సభలో రచ్చకు దారితీశాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన వ్యక్తిగత సంవాదం అలాంటిదే. ఇది రాజకీయపరమైనదే కావచ్చు కానీ, అందుకు అసెంబ్లీ వేదిక కాకుంటే బాగుండేది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్ అనుచిత ప్రవర్తన సభకు మచ్చ తెచ్చేదే. అయితే, నాగేందర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలోనే బహిరంగంగా మందలించి లేదంటే ఆయన ప్రవర్తనను తప్పబట్టి ఉంటే బాగుండేది. అధికార పార్టీ సభ్యుడి ప్రవర్తన సభ విలువతోపాటు సభా నాయకుడైన ముఖ్యమంత్రి ప్రతిష్టను కూడా మసకబారుస్తుందని గుర్తుంచుకోవాలి.
బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో పక్కదారి పట్టిన రూ.18000 కోట్ల విలువైన వరి ధాన్యం గురించి సభలో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రస్తావిస్తారని, ఆ ధాన్యాన్ని రికవరీ చేసేందుకు సభలో ఓ నిర్ణయం తీసుకొంటారని అందరూ భావించారు. కానీ, ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అది ప్రతిపక్షానికే మంచిదైంది. ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించి ఉంటే బీఆర్‌ఎస్ ఇరుకునపడేది. నాడు రైతులపై జరిగిన వేధింపులు, పౌరసరఫరాల శాఖకు చెందిన అప్పులు రూ.14000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెరిగిన తీరును కూడా ఆ శాఖ మంత్రి సభలో ప్రధానంగా ప్రస్తావించి ఉంటే ధాన్యం సేకరణ విషయంలో గత పదేండ్లలో ఏం జరిగిందో ప్రజలకు మరింత స్పష్టత వచ్చేది. కానీ ఈ అంశాన్ని డిఫ్యూటీ సీఎం తన బడ్జెట్ ప్రసంగంలో లీలగా మాత్రమే ప్రస్తావించారు.
అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఉన్నదా? లేదా? అన్న అనుమానం కలిగింది. ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు. అయినా అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఏమాత్రం ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదంటే వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయటంలో బీజేపీ విఫలమైందా? అన్నది చర్చనీయాంశమే. బీజేపీ వెనుకబడిపోవటంతో సమావేశాలు ఆద్యంతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎన్ అన్నట్టుగానే సాగాయి. బీజేపీ గళం సభలోకంటే బయటే ఎక్కువగా వినిపించింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చిస్తున్నారు. అలాంటప్పుడు సభలో ఆందోళనలు, బాయ్‌కాట్లతో సభా సమయం వృధా కావటమే కాకుండా, ప్రజా ధనం కూడా వృధానే. అంతేకాదు ప్రజల విస్తృత ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదమూ ఉన్నది.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి