పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి
సీఎస్, డీజీపీతో మండలి చైర్మన్, స్పీకర్ సమీక్ష
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కాను న్నాయి. ఈ సందర్భంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. గురువారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, రామచంద్రనాయక్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, అదనపు డీజీపీ మహేష్‌కుమార్ భగవత్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, ట్రాఫిక్‌తో పాటు జీఏడీ అధి కారులు హాజరయ్యారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండటంతో.. ఆర్థికశాఖ అధికారులతోనూ స్పీకర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపపెట్టనుండగా, దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే పలుమార్లు చెప్పారు.
ఈ సమావేశంలో మండలి చైర్మన్, స్పీకర్‌కు జిల్లాల్లో ప్రొటోకాల్ అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం. మండలి చైర్మన్, స్పీకర్ జిల్లాలకు వెళ్లినప్పుడు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పోలీసులతోపాటు వివిధ శాఖ ల అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవ డం, భద్రత విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలిసింది. గ్రామీణ ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగిన భద్రత, బందోబస్తు కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లేటప్పుడు ఎయిర్‌పోర్టులో కూడా తగిన ప్రొటోకాల్ పాటించేలా చూడాలని సూచించారు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని సీఎస్, డీజీపీ ఇతర అధికారులు పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
త్వరలో విద్యాశాఖపై ప్రీ బడ్జెట్ సమావేశం
బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వం వరుసగా ఆయా శాఖలతో సమీక్షలు నిర్వహిస్తోం ది. ఈ క్రమంలోనే త్వరలోనే పాఠశాల విద్యాశాఖపై సీఎం, డిప్యూటీ సీఎంతో ఉన్నతాధికా రుల ప్రీ బడ్జెట్ సమావేశం జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో పాఠశాల విద్యాశాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని కోరనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధంచేసి ఉంచారు. ఈ రూ.20 వేల కోట్లలో రూ.16 వేల కోట్లు కేవలం ఉపాధ్యాయులు, ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నది. మిగిలిన రూ.4 వేల కోట్లతో వివిధ పథకాలను అమలు చేయాల్సి ఉం టుంది. ఈ ఏడాది జనవరిలో పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.21,389 కోట్లు కేటాయించారు. ఈసారి విద్యాశాఖకు భారీగా నిధులు కేటాయించే వీలుంది.