- తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
- వాడివేడిగా సాగనున్న సమావేశాలు
- ప్రజా సమస్యలే అజెండాగా ప్రతిపక్షాలు సన్నద్ధం
- విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు సర్కార్ రెడీ
- రైతు సమస్యలే బీఆర్ఎస్ ప్రధాన అస్త్రం
- కొత్త రెవెన్యూ చట్టం, రుణమాఫీ, రైతుభరోసా, ధాన్యం కొనుగోళ్లపై నిలదీత..
- లగచర్ల, మూసీ, హైడ్రా అంశాలపై చర్చకు పట్టుపట్టనున్న విపక్షాలు
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): శీతాకాల అసెంబ్లీ సమావేశాల కు రాజకీయ పార్టీలు సిద్ధ్దమవుతున్నా యి. సోమవారం నుంచి ప్రారంభమ య్యే శాసనసభ, శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఎం ఐఎం, సీపీఐ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తుండగా, ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలు, ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతున్నది. అసెంబ్లీలో వ్యవహరించే అంశా లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు ఆదివారం దిశానిర్దేశం చేశారు.
ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించడంతోపాటు మూసీ ప్రక్షాళన, కొత్త రెవెన్యూ చట్టం, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సభలో వివరించేందుకు అధికార పార్టీ సిద్ధ్దమవుతోంది.
ఆరు గ్యారెంటీల్లో అమలు చేస్తున్న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇంది రమ్మ ఇళ్లు వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలపై లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధమవుతోంది.
ఇక కొడంగల్‌లో ఫార్మా కంపెనీలకు లగచర్ల భూసేకరణ విషయంలో రైతులపై కేసులు, మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లు నేలమట్టం చేయడం, హైడ్రా పేరుతో హడావిడిగా ఇళ్లు, భవనాలను నేలమట్టం చేయడాన్ని సభలో చర్చకు పట్టుబట్టేం దుకు విపక్షాలు రెడీ అవుతుండగా, మూసీనది వల్ల కలిగే అనర్థాలను లెక్కలతో సహా వివరించి.. బీఆర్ఎస్ను కట్టడి చేయాలని అధికార పార్టీ భావిస్తోంది.
రాష్ట్రానికి కంపెనీలు రావద్దా? వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ది చెందడం, నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం బీఆర్ఎస్కు ఇష్టం లేదంటూ సభ లో ఎదురుదాడికి సన్నద్ధమవుతున్నది. గ్రేటర్ పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలతోపాటు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, వాటిని రక్షించి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించేం దుకు హైడ్రాను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెప్తోంది.
అయితే, బీఆర్ఎస్తోపాటు బీజేపీ, ఇతర పార్టీ లు మాత్రం ఇక్కడి ప్రజలను బెదిరించి డబ్బులు దండుకోవాలని, తద్వారా అ డబ్బులను కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు పంపించాలనే కూల్చివేతలకు పాల్పడుతున్నారని విరుచుకుపడుతున్నాయి.
నేడు బీఏసీ సమావేశం.. సభా పనిదినాలపై చర్చ
మొదటి రోజు శాసనసభ, శాసనమండలి సమావేశాల తర్వాత బిజినెస్ అడ్వయిజరీ (బీఏసీ) కమిటీ సమావేశం స్పీకర్, శాసన మండలి చైర్మన్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి, ఇతర సభ్యులు హాజరవుతారు. ఈ బీఏసీ సమావేశంలోనే శాసనసభా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
మొదటి రోజు సభా ప్రారంభం కాగానే సర్కార్ ఏడాది పాలనలో చేపట్టిన వివరాలను అధికార పార్టీ వివరించనుంది. ఆ తర్వాత సభను వాయిదా వేయనున్నారు. సాయంత్రం 6.05 గంటలకు సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.
శాసన సభ, శాసన మండలిలో తొలిరోజు ఎజెండా అంశాలు
* తెలంగాణ జీతాలు, పెన్షన్ల చెల్లింపు, అనర్హుల తొలగింపు సవరణ-2024
* తెలంగాణ పురపాలక సంఘాల సవరణ-2024 అర్డినెన్స్
* హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సవరరణ-2024 ఆర్డినెన్స్
* తెలంగాణ వస్తు సేవల పన్ను సవరణ -2024 ఆర్డినెన్స్ అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు.
* 2022-23కుగాను తెలంగాణ విద్యుత్, ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక ప్రతిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు.
* 2021-22కు సంబంధించిన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఏడో వార్షికోత్సవం నివేదికను మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టనున్నారు.
* పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు.