calender_icon.png 24 October, 2024 | 3:59 AM

నేటి నుంచి అసెంబ్లీ

23-07-2024 01:01:01 AM

బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం

  1. రేపు మండలి సమావేశాలు మొదలు
  2. నేడు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ భేటీ
  3. 25న అసెంబ్లీకి పూర్తిస్థాయి బడ్జెట్
  4. ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి 
  5. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రసంగం 
  6. ఉదయం సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీ
  7. బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోదానికి..

హైదరాబాద్, జూలై 21(విజయక్రాంతి): రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. శాసన మండలి సమావేశాలు బుధవారం నుంచి మొదలు కానున్నాయి. ఈ నెల 25న ప్రభుత్వం 2024-25ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్‌ను శాసన సభలో డిఫ్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడుతారు. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మొదటి రోజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీలో నివాళులు అర్పించిన తర్వత సభ బుధవారానికి వాయిదా పడుతుంది. తొలిరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు ఈ నెల 31వ తేదీలోపు సభ ఆమోదం తెలపాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి అటంకాలు ఎదురు కాకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది.  

25న పూర్తిస్థాయి బడ్జెట్ 

ఈ నెల 25న అసెంబ్లీలో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 31వ తేదీతో ఓటాన్ ఆకౌంట్ బడ్జెట్ కాలపరిమితి పూర్తవుతుంది. ఆలోపే పూర్తి స్థాయి బడ్జెట్‌కు సభ ఆమోదం తెలుపాలి. బడ్జెట్ ప్రతిపాదనలను చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గాను మంత్రివర్గం 25న అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9:30 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం కానున్నది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.  బడ్జెట్ సమా వేశాల సందర్భంగా సభ్యులు లెవనెత్తే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సమావేశాల సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం లోపం ఏర్పడకుండా సీనియర్ అధికారులు అసెంబ్లీలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సీఎస్ శాంతికుమారి ఇప్పటికే ఆదేశించారు. 

మూడంచెల భద్రత

అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో ఆటంకాలు కలగకుండా పోలీసు శాఖ మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్,  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ అంశంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావే శాల సమయంలో వివిధ వర్గాలు ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో గన్‌పార్కు వద్ద, అసెంబ్లీ ప్రవేశ ద్వారాలు, పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించనున్నారు. సివిల్‌తోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తారు. పాసులు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని పోలీసువర్గాలు తెలిపాయి.