- అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- ఆర్వోఆర్ చట్టం, కులగణన, పంచాయతీ ఎన్నికలపై చర్చ!
- ఆలోపే మంత్రివర్గ విస్తరణకు యోచన
హైదరాబాద్, నవంబర్ 21 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అమలవుతున్న పథకాల పురోగతిపై ఒక స్పష్టత రానున్నది. దీని కోసం అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగా త్వరలోనే అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9 నుంచి శీతాకాల సమావేశాలను ప్రారంభించనున్నట్టు సమాచారం. అధికార పగ్గాలు చేపట్టి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేకత సంతరించుకున్నది.
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలుతీరు, చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రెఫరెండంగా ఈ సమావేశాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతోపాటు గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన నష్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకురానున్నట్టు సమాచారం.
ఆర్వోఆర్, కులగణనపై స్పష్టత..
త్వరలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్వోఆర్ చట్టం ఆమోదించడంతోపాటు రైతు రుణమాఫీ, ఆసరా పింఛన్లు, కులగణన సర్వే, పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశాలపై సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇంకా పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడం, వృద్ధులకు ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ సమావేశాల్లో సందర్భంగా వీటికి పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.
దీంతోపాటు ఈ నెలాఖరులోగా సమగ్ర కుటుంబ సర్వే కూడా పూర్తవుతున్న నేపథ్యంతో కులగణన అంశం, త్వరలో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న క్రమంలో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేకత సంతరించుకున్నది.
నష్ట నివారణ చర్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నం చేసింది. అయినప్పటికీ రుణమాఫీ, ఆసరా పింఛన్లు, రైతు భరోసా మినహాయిస్తే మిగిలిన పథకాల పట్ల ప్రజల్లో కూడా సానుకూలమైన అభిప్రాయమే ఉంది. కానీ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడం, ఆసరా పింఛన్లు సరిగా అందకపోవడం, రైతు భరోసా అందించడంలో జాప్యం జరగడంపై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది.
దీంతో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలతో ప్రజలకు నమ్మకం కలిగించేలా నిర్ణయాలు వెల్లడించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆసరా పింఛన్లు, రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఆ లోపే మంత్రివర్గ విస్తరణ
డిసెంబర్ 7వ తేదీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. దీంతోపాటు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించాలని అనుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆ లోపే మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేయాలని యోచిస్టున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణకు ఏదో ఒక అడ్డంకులు వస్తున్న నేపథ్యంలో ప్రసుత్తం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణ కానున్నట్టు తెలుస్తోంది.