calender_icon.png 12 January, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23 నుంచి అసెంబ్లీ

19-07-2024 12:54:37 AM

24న మండలి సమావేశాలు ప్రారంభం 

25న అసెంబ్లీలో పూర్తిస్థాయి పద్దు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

రూ.2.80 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ ఖరారు!

రుణమాఫీ, విద్యుత్‌పైనే సర్కారు ఫోకస్

పదిరోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం-

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభంకానుంది. 24 నుంచి శాసనమండలి సమావేశాలు మొదలవనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీచేశారు. మొదటిరోజున అసెంబ్లీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యనందితకు సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు, ఇతర నిధులను పరిశీలించి రాష్ట్ర పద్దుకు తుది రూపం ఇవ్వనున్నారు. ఈ నెల 25న అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వనుంది. నాలుగు  నెలల కోసం ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ ఆమోదించిన రూ.2.75 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమవేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్‌తో పాటు ధరణి, రైతుభరోసా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, జాబ్ క్యాలెండర్, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధిపొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ చిహ్నం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఈ నెల 11న  వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమావేశాలు జరిగే సమయంలో శాంతిభద్రతలు  తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పీకర్, మండలి చైర్మన్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ తొలిసారిగా..

సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆర్థికశాఖ తుదిమెరుగులు దిద్దుతోంది. ఇప్పటికే శాఖలకు కేటాయింపుల విషయంలో ఆర్థికశాఖ ఒక అంచనాకు వచ్చింది. వివిధ డిపార్ట్‌మెంట్స్ నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా రూ.2.80లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. వాస్తవికతకు దగ్గరగా ఉండాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేసినట్లు సమాచారం. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్‌లో కేటాయించిన వ్యయాన్ని పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు.

అందుకే వ్యయ కేటాయింపులు నూటికి నూరు శాతం జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ తొలిసారిగా ఫుల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. 2014లో సార్వత్రిక ఎన్నికల ముందు నాటి ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి రఘువీరారెడ్డి చివరిసారిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తొలిసారిగా పూర్తిస్థాయి పద్దును ప్రకటించబోతోంది. 

కేంద్ర కేటాయింపులను అనుసరించి..

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల 31తో ముగియనుండగా మిగితా 8 నెలలకు సంబంధించిన బడ్జెట్‌ను కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు కేంద్రం ఎంత నిధులు కేటాయిస్తుందో చూసి అప్పటివరకు ప్రాథమికంగా సిద్ధం చేసుకున్న పద్దుకు సవరింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ప్రాధాన్యం ఇవ్వని పథకాలకు రాష్ట్ర బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రం ప్రకటించిన మరుసటి రోజు రాష్ట్రంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ బడ్జెట్‌లో కీలక శాఖలకు కేటాయింపులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్, ఇరిగేషన్ రంగాలకు కలిపి దాదాపూ రూ.1.1లక్షల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో వ్యవసాయశాఖకు రూ.19,746 కోట్లను సర్కారు కేటాయించింది. అయితే పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.65వేల కోట్లకు కేటాయించాలని వ్యవసాయశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఇందులో రూ.31వేల కోట్లను రుణమాఫీకే సర్కారు కేటాయించనుంది. అలాగే, రైతు భరోసాకు మరికొంత కేటాయించనుంది. ఇరిగేషన్ శాఖకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.28,024 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఆ అంచనాలు రూ.30వేల కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవల వెంటనే పూర్తయ్యే ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.11 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం గుర్తించింది. విద్యుత్ సబ్సిడీ కింద ప్రతి ఇంటికీ 200 యూనిట్లను ఉచితంగా ఇవ్వనుంది. దీనికోసం రూ.15వేల కోట్ల వరకు అవసరం అవుతాయని సర్కారు అంచనా వేస్తోంది.

గ్యారెంటీలకు రూ.75 వేల కోట్లు

పూర్తిస్థాయి పద్దులో ఆరు గ్యారెంటీలకు దాదాపు రూ.75 వేల కోట్లను కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.53,196 కోట్లను కేటాయించింది. ఆయా పథకాల లబ్ధిదారులు అనుకున్నదాని కంటే ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అంచనాలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో గల్ఫ్ వలస కార్మికులకు కూడా నిధులను కేటాయించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. తెలంగాణ నుంచి దాదాపు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వీరి కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు వీరికి ఈ బడ్జెట్‌లో రూ.500కోట్లు  కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.