10-03-2025 11:54:02 PM
రంజాన్ మాసంలో ఫ్యాషన్ షోలు అవసరమా..?
విచారణ జరుగుతోందన్న సీఎం ఒమర్ అబ్దుల్లా..
శ్రీనగర్: రంజాన్ ఉపవాసాల వేళ జమ్మూకశ్మీర్‌లో ఫ్యాషన్ షో నిర్వహించడం పట్ల ఆ రాష్ట్ర అసెంబ్లీ భగ్గుమంది. ఈ వివాదంపై తమ ప్రభుత్వం విచారణ చేస్తోందని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. గుల్మార్గ్‌లోని స్కై రిసార్ట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణపై అంతా భగ్గుమంటున్నారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఫొటోల్లో మహిళలు, పురుషులు అర్ధనగ్నంగా ఉండడంపై విమర్శకులు ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర సంస్కృతిని ఈ కార్యక్రమం మంట గలిపిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై 24 గంటల్లో నివేదిక అందుతుందని తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
క్షమాపణలు చెప్పిన డిజైనర్లు..
పవిత్ర రంజాన్ మాసంలో గుల్మార్గ్‌లో ఔట్‌డోర్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షోపై తీవ్రమైన అభ్యంతరాలు రావడంతో డిజైనర్లు శివన్, నరేష్ క్షమాపణలు చెప్పారు. ‘మేము ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు ఇలా చేయలేదు. మా వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి. సృజనాత్మకతను సెలబ్రేట్ చేసుకునేందుకే ఇలా చేశాం.’ అని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ నేతలకు వారు క్షమాపణలు తెలియజేశారు.